సీఐడీ దూకుడు
వచ్చింది రూ.54 వేలు.. ఇచ్చింది రూ.9 వేలు
పక్కన ఉన్న ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడు వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన పోతుల మాణిక్యం. 2007లో అప్పటి నిబంధనల మేరకు అతడి ఇద్దరు కూతుళ్లు పూర్ణ, మంగ పేరిట ఇల్లు మంజూరైంది. దీంతో చెరో గది నిర్మించుకున్నారు. వీవోలు ఇద్దరికీ కలిపి కేవలం రూ.తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయంటూ చెల్లించారు. మిగిలిన మొత్తం కోసం తండ్రికూతుళ్లు కార్యాలయాల చుట్టు కాళ్లరిగేలా తిరిగినా.. కరుణించలేదు. సీఐడీ డీఎస్పీ మహేందర్ గురువారం గ్రామానికి రావడంతో మాణిక్యం అతడికి ఫిర్యాదు చేశాడు. ఆయన రికార్డులు తెప్పించుకుని పరిశీలించగా.. పూర్ణ పేరిట రూ.31వేలు, మంగ పేరిట రూ.23వేలు వీవో అకౌంట్‌లో ఎప్పుడో జమ అయినట్లు గుర్తించారు. లబ్ధిదారుడికి రూ.9వేలు మాత్రమే చెల్లించి.. మిగిలిన రూ.45వేలు స్వాహా చేసినట్లు గుర్తించి నివ్వెరపోయారు. - వీణవంక
- ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై విచారణ వేగం
- కదులుతున్న అక్రమాల డొంక
- ఒకే ఇంటికి రెండు బిల్లులు
- ప్రభుత్వ ఉద్యోగులూ భాగస్వాములే
- అవినీతిలో రెడ్డిపల్లి డివిజన్‌లోనే టాప్
- అధికారుల తనిఖీల్లో వెల్లడి
రెడ్డిపల్లి(వీణవంక) :ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవినీతిని పెకిలించేందుకు సీబీ సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. మొదటి విడతగా వీణవంక మండలం రెడ్డిపల్లిలో గురువారం విస్తృతంగా తనిఖీలు చేశారు. సీఐడీ డీఎస్పీ మహేందర్, సీఐలు ప్రకాశ్, వెంకటరమణ ఆధ్వర్యంలో మొత్తం 17 ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి.. స్వయంగా గుర్తించిన అక్రమాలను రికార్డు చేసుకున్నారు. జిల్లాలో మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా అవినీతి జరగగా.. వీణవంక మండలంరెడ్డిపల్లి గ్రామం మొదటి స్థానంలో ఉంది.
ఈ గ్రామంలో 68శాతం నిధులు దుర్వినియోగమయ్యాయి. ఆ తర్వాతి స్థానం ఇదే మండలంలోని కొండపాకది. ఇక్కడ 35శాతం నిధులు దుర్వినియోగమయ్యాయి. సంబంధిత అక్రమాల రికార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు.. తహశీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్, మహిళా సంఘాల నుంచి కూడా వివరాలు సేకరించారు. మొదటి విడతగా రెడ్డిపల్లిలో తనిఖీలు ప్రారంభించారు. ఇళ్లు పొందిన వారిలో సింగరేణి ఉద్యోగులు, రైల్వే, ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం.. ఒకే ఇంటిపై రెండు బిల్లులు తీసుకున్నట్లు తెలుసుకుని బిత్తరపోయారు. అదే సమయంలో కొందరికి మాత్రం వీవోలు ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని గుర్తించారు.
రెడ్డిపల్లికి మొత్తం 556 ఇళ్లు మంజూరయ్యాయి. 2004లో ఎనిమిది, 2005-06లో పద్నాలుగు, 2006 నుంచి 2009 వరకు 446, 2010-11లో30, 2011లో ఐదు, 2012-13లో నాలుగు, 2013-14లో తొమ్మిది మంది లబ్ధిదారులను ఏడు విడతలుగా అధికారులు ఎంపిక చేశారు. ఇందులో 108 ఇళ్లు పూర్తికాగా.. మిగిలినవి మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే గ్రామంలో మొత్తం 750 కుటుంబాలు ఉండగా.. 556 ఇళ్లు మంజూరుకావడంపై థర్డ్‌పార్టీ సర్వేలో సిబ్బందే విస్మయానికి గురయ్యారు. 17 ఇళ్లలో మొత్తం అవకతవకలేనని గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
మచ్చుకు కొన్ని..
గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి రమ భర్త రాజయ్య రైల్వే ఉద్యోగి. రమ పేరిట 2006లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్‌మెంట్ వరకు కట్టి వదిలేసిన ఆమెకు అధికారులు రూ.3200, రూ.2220 విలువైన సిమెంట్ బస్తాలు ఇచ్చారు.
- కొమ్మెర తిరుపతమ్మ, మోత్కూరి యాదగిరి కుటుంబ సభ్యులు సింగరేణిలో ఉద్యోగులు. వీరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఒకే ఇల్లు పూర్తి చేసి రెండు బిల్లులు తీసుకున్నారు. ఓ ఇల్లు కట్టకుండానే రూ.62వేలు లబ్ధి పొందినట్లు అధికారులు తేల్చారు.
- సుభామని, పోతుల లక్ష్మి పేరిట రెండిళ్లు మంజూరయ్యాయి. అయితే ఇద్దరు కలిసి ఒకే ఇల్లు నిర్మించి రెండు బిల్లులు తీసుకున్నారు. మొదటి బిల్లుగా రూ. 31వేలు తీసుకున్న తర్వాత ఒక మంజూరు పత్రాన్ని తిరిగి ఇచ్చారు. అధికారులు గుర్గుపట్టకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
- మాడ కౌసల్య, మాడ సౌందర్య అత్తాకోడళ్లు. వీరు ఒకే ఇంటిపై రెండు బిల్లులు పొందారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఇలా గ్రామంలో 17ఇళ్లను తనిఖీ చేసిన అధికారులు జరిగిన అక్రమాలను రికార్డు చేశారు. రెండో విడతగా కొండపాకలో శుక్రవారం సర్వే చేయనున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
మల్హర్‌లోనూ..
మల్హర్ : మల్హర్ మండలంలోని రుద్రారం, చిగురుపల్లి, పాతరుద్రారం గ్రామాల్లో గరువారం సీఐడీ సీఐ సాయిరమణ, వెంకటనర్సయ్య, పెద్దపల్లి సీఐ రాములు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. ఇళ్ల నిర్మాణాలు ఏయే స్థాయిలో ఉన్నాయి..? బిల్లులు ఎంత చెల్లించారు..? వంటి వివరాలు నమోదు చేసుకున్నారు. 147 గృహాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. గ్రామంలో లేనివారి పేరిట కూడా ఇళ్లు మంజూరైనట్లు తెలుసుకున్నారు.