‘నకిలీ నోట్ల’ ఎల్లంగౌడ్ లొంగుబాటు
కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలతో సంబంధాలపై ఆరా
ఫలించిన కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరికలు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసుల హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ ఎట్టకేలకు లొంగిపోయాడు. మజీద్‌పురా డెకాయి ఆపరేషన్‌లో కానిస్టేబుల్ ఈశ్వర్‌రావును చంపి పరారైన ఎల్లంగౌడ్ కోసం 18 రోజులుగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14న శంషాబాద్ ఎన్‌కౌంటర్‌లో చైన్‌స్నాచర్ శివ మృతి చెందిన సందర్భంగా కమిషనర్ ఎల్లం గౌడ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకకు పారిపోయిన అతడు మెదక్ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది, బీజేపీ నేతతో కలసి సైబరాబాద్ పోలీసుల ఎదుట మంగళవారం రాత్రి వచ్చి తుపాకీ సహా లొంగిపోయాడు. నకిలీ నోట్ల తయారీ ముఠాలోని మెదక్ జిల్లా సిద్దిపేటకు చెంది ముస్తఫా, శ్రీకాంత్, ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు అదే ముఠాకు చెందిన రఘు, నరేష్‌లతో బాలానగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకట్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఈ నెల 1న మజీద్‌పూర్ చౌరస్తా వద్ద డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లం గౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు కత్తిపోట్లకు గురై మృతి చెందగా.. వెంకట్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన మస్తాన్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముఠా నాయకుడు ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు కమిషనర్ సీవీ ఆనంద్ నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో అతను కర్ణాటకకు పారిపోయాడు. తాజాగా కమిషనర్ హెచ్చరికలతో న్యాయవాదితో వచ్చి లొంగిపోయాడు.
ఆరా తీస్తున్న పోలీసులు...: మెదక్ జిల్లా సిద్దిపేట కేంద్రంగా నకిలీ నోట్ల దందా కొసాగిస్తున్న ఎల్లం గౌడ్‌కు కర్ణాటక, మహారాష్ట్రలలోని మరిన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఎల్లం గౌడ్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి నకిలీ నోట్లు ఏఏ రాష్ట్రాలకు వెళ్లాయి...ఈ ముఠా వెనుక ఇంకెందరున్నారు, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయాలపై విచారిస్తున్నారు. ఎల్లం గౌడ్‌పై కర్ణాటక, మహారాష్ట్రలలో పెండింగ్ ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లపైనా ఆరా తీస్తున్నారు. ఎల్లం గౌడ్ ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం వీరి అరెస్టును చూపించే అవకాశాలు ఉన్నాయి.