నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టు
నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. అతడిని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట ప్రాంతంలో ఎల్లంగౌడ్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఎల్లంగౌడ్ పోలీసుల మీదే కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడి అనుచరుడితో పాటు కానిస్టేబుల్ కూడా మృతి చెందారు.
ఇదే కాల్పుల్లో ఎస్ఐ వెంకట్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడి చాలాకాలం పాటు చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎల్లంగౌడ్ అరెస్టు కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లంగౌడ్ మహారాష్ట్రకు పారిపోయి ఉంటాడనే పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు తరచు తన భార్యకు ఫోన్ చేస్తుండటంతో ఆమె కాల్ డేటా ఆధారంగా అతడున్న ప్రాంతం వివరాలు సేకరించి అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. అయితే, అతడు స్వయంగా కమిషనర్ ముందు లొంగిపోయాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.