
దేశంలో చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారు
లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి
హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో చట్టాలను గౌరవిస్తుంటే, మన దేశంలో మాత్రం చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. గాదలె లక్ష్మీభాయి కృష్ణారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బేగంపేట్ ఫార్చూన్ మనోహర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభాషణ్‌రెడ్డి మాట్లాడారు. దే శంలో ఎన్నో చట్టాలు కేవలం పేరుకే ఉన్నాయని, వాటిని అమలు చేయడం లేదని అన్నారు.
2009 లో విద్యాహక్కు చట్టం తీసుకొచ్చినా ఇంకా బడిలో చేరని పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం రోగులు తమ ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయన్నారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరూ తమ రంగాల్లో సేవాభావాన్ని జోడించి సమాజ హితానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్ జి.కల్యాణ్ దాస్ జీవిత చరిత్ర పుస్తకం ‘ఏ రివర్ త్రూ హిల్‌లాక్స్’ ను జస్టిస్ విలాస్ అఫ్జల్‌పుర్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సీఏ మనోజ్ ఫడ్నీస్, శక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణరావు, డాల్ఫిన్ మార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు తదితరులు పాల్గొన్నారు.