సార్వత్రిక ఎన్నికలలో ఎలా గట్టెక్కేదని ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతుంటే, పురపాలక ఎన్నికలు, ఆపై వచ్చిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వారికి తల నొప్పి తె చ్చిపెడుతున్నాయి. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగనున్నాయి. వాటికి సంబంధించి నామినేషన్ల ప్ర క్రియ ముగిసింది.
అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరికి బీ ఫారం ఇవ్వాల న్న దానిపై ఇంకా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సమయంలో నిన్నమొన్నటి వరకు పరిషత్ ఎన్నిక లు వాయిదా పడుతాయనుకున్న వారికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో కొత్త టెన్షన్ మొదలైంది.
ఎన్నికలకు సిద్ధం
జిల్లాలో 36 మండలాలున్నాయి. ఆయా మండలాలకు సంబంధించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎన్నికలు వచ్చే నెల 6న జరుగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 17 నుంచే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ నాకంటే నాకంటూ పోటీపడుతున్నారు. దీంతో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలో తెలియక ఆయా పార్టీల నేతలు తలలుపట్టుకోవలసి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఎన్నికలు రావడంతో ఎవరిని కాదన్నా తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థిత్వాల ఎంపిక సమయంలో జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో చోట ఒక పార్టీ నుం చి నలుగురైదుగురు టిక్కెట్ రేసులో నిలుస్తున్నారు. దీంతో అందరినీ సముదాయించడం తలకుమించిన భారంగా మారింది. పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు పది మ ందిని వెంటేసుకుని ముఖ్య నాయకుల వద్దకు తరలివస్తుండడంతో నేతల ఇండ్లు సందడిగా మారుతున్నాయి.
అప్పుడే సిట్టింగులు
ఎన్నికలలో పోటీ పడాలనుకుంటున్నవారు గ్రామాలలో అప్పుడే సిట్టింగులు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నవారు మాత్రం ఏకంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న భిక్కనూరు మండలంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు జడ్పీటీసీగా బరిలో నిలవడానికి సిద్ధమై తనకు సంబంధించిన భూమిని అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది
. మరొకరు జడ్పీటీసీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు గాను తన స్నేహితుల తో విందు ఏర్పాటు చేయగా అందరూ మద్దతు తెలిపి రూ. 20 లక్షల వరకు సహాయం అందిస్తామని ముందుకు వచ్చినట్టు సమాచారం. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన మాచా రెడ్డి జడ్పీటీసీ స్థానంలో తమ కుటుంబ సభ్యులను పోటీకి నిలపడానికి పలువురు నాయకులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
పోటీ ఎక్కువే
పార్టీలో ముగ్గురు, టీఆర్‌ఎస్‌లో ఇద్దరు టిక్కెట్ రేసులో నిలిచారు. ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. దోమకొండ జడ్పీటీసీ స్థానం కూడా జనరల్ కావడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీ ల్లో తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేయడానికి అన్ని చోట్లా తీవ్ర పోటీ కనిపిస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ఇతర పార్టీల నుంచి పోటీచేస్తామని కొందరు, ఇండిపెండెంట్‌గా నిలిచి తన సత్తా చూపుతామనేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలేమో గాని పల్లెల్లో మాత్రం రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల ఫిరాయింపులు కూడా పెరిగాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో, ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నొక పార్టీలోకి వెళ్లిన నేత, నేడొక పార్టీ గడప తొక్కుతున్నాడు.