
మాట్లాడుతున్న వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్.
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీసులపై సోషల్ మీడియాలో అర్థరహిత ఆరోపణలు చేసిన అట్లూరి సురేష్, ప్రవిజ దంపతులు అందుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించాలని లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్.శ్రీనివాస్ తెలిపారు. బంజాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ కలింగరావుతో పాటు ఇద్దరు ఎస్‌ఐలపై ప్రవిజ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సోమవారం వైరల్ అయింది. పోలీసులు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ విలేకరులతో మాట్లాడారు. అట్లూరి సురేష్, వాసుదేవశర్మ అనే వ్యక్తి మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయన్నారు.
శర్మవద్ద రూ.4.70లక్షలు తీసుకున్న సురేష్ వాటిని తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. దీనిపై శర్మ ఫిర్యాదు చేసేందుకు రాగా అది సివిల్ వివాదమైనందున ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు. దీంతో వాసుదేవశర్మ కోర్టుకు వెళ్లి నోటీసు తీసుకురావడంతో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు సురేష్‌ను పిలిపించి మాట్లాడరన్నారు. ఆ సమయంలో సురేష్ పోలీసులను దూషించడమేగాక ఓ ఎస్‌ఐ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, దీంతో 8న సురేష్, ప్రవిజలపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారనే కక్షతో నిందితులు వారిపై ఆరోపణలు చేశారని దీనిపై తాను విచారణ చేపట్టగా అవన్నీ అవాస్తవాలుగా తేలిందన్నారు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనూ వారు అదే తరహాలో ప్రవర్తించడంతో కేసు నమోదైందన్నారు. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులను బ్లాక్‌మేయిల్ చేస్తుంటారని తెలిపారు. న్యాయ సలహా తీసుకొని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 8న పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియోలు తమవద్ద ఉన్నాయన్నారు.