ఆనందం.. ఆపై విషాదం
ఖమ్మం రూరల్/కూసుమంచి: ఖమ్మంలో ఘోరం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువ దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వారి కుటుంబీకులు తెలిపిన ప్రకారం...
కూసుమంచి మండలం చౌటపల్లికి చెందిన సోమనబోయిన ఉపేందర్(30), మమత(28) దంపతులు. వీరిద్దరూ శుక్రవారం చౌటపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ సమీపంలో వీరి వాహనాన్ని, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
రోడ్డుపై పడిపోయిన ఉపేందర్, మమత మీద నుంచి ఆ లారీ దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న వీరిద్దరినీ, అక్కడికి సమీపంలోని పెట్రోల్ బంకు వద్దనున్న 108 సిబ్బంది వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మమత మృతిచెందింది. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటి తరువాత ఉపేందర్ కూడా మృతిచెందాడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం, ఎస్‌ఐ లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగంలో చేరేందుకు ఆనందంగా వెళుతూ..
ఉపేందర్‌కు, నల్గొండ జిల్లా చివ్వెంలకు చెందిన మమతతో 2011లో వివాహమైంది. ఉపేందర్ ఎంఎస్‌సీ బీఈడీ, మమత బీఎస్సీ పూర్తిచేశారు. వీరిద్దరూ నర్శింహులగూడెంలో ప్రయివేటు పాఠశాల నెలకొల్పారు. నిర్వహణాపరమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యల కారణంగా ఈ పాఠశాలను నెల రోజుల కిందట వేరే వారికి అప్పగించారు. అప్పటి నుంచి ఖమ్మంలోని ప్రైవేట్ పాల కేంద్రంలో సూపర్‌వైజర్‌గా ఉపేందర్ పనిచేస్తున్నాడు. అక్కడే మమతకు కూడా ఉద్యోగం చూశాడు. శుక్రవారమే ఆమె విధుల్లో చేరాల్సుంది. ‘ఒకేచోట ఉద్యోగం చేయబోతున్నామన్న ఆనందంతో వారిద్దరూ శుక్రవారం ఉదయం చౌటపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం బయల్దేరారు. మమత గర్భవతి కావడంతో ఆస్పత్రికి కూడా వెళ్లాలనుకున్నారు’ అని, వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ చెప్పారు.
కొడుకా... మేమెలా బతకాలి..
ఉపేందర్‌కు తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నా రు. ‘ఇంటికి పెద్ద దిక్కువు నువ్వే లేకపోతే నీ తమ్ముడు, మేము ఎలా బతకాలిరా..’ అంటూ, ఆస్పత్రిలో ఉపేందర్ తల్లిదండ్రులు గుండలెవిసేలా రోదించారు.
క్రితం రోజే జన్మదిన వేడుక...
ఉపేందర్-మమతది అన్యోన్య దాంపత్యమని బంధువులు, స్థానికులు చెప్పారు. ‘గురువారం రోజే మమత పుట్టిన రోజు. ఆ మరుసటి రోజునే ఆమె ఉద్యోగంలో చేరనుంది. త్వరలోనే తల్లి కూడా కాబోతోంది. ఇలా, సంతోషాలన్నీ ఒకేసారి రావడంతో.. పుట్టిన రోజు వేడుకను అందరం ఆనందంగా జరుపుకున్నాం’ అని, ఉపేందర్-మమత దంపతుల కుటుంబీకులు రోదిస్తూ చెప్పారు. వృతదేహాలను చూసేందుకు ఖమ్మం ఆస్పత్రికి చౌటపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.