Upendar
-
ప్రేమ ప్రభావం
నిఖిల్ దేవాదుల (‘బాహుబలి’ ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘15–18–24 లవ్‌స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను కథానాయిక మెహరీన్ చేతుల మీదగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. 15–18–24 వయసులలో ప్రేమ, దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్‌గా నిలుస్తుంది. ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో ఈ ఫైట్‌ని చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బీవీ శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్. -
కూతురిపై తండ్రి దారుణం
మద్యం మత్తులో ఓ తండ్రి కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్నె ఉపేందర్, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే, ఉపేందర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇదే విషయమై భార్య నాగమణి బుధవారం సాయంత్రం ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన ఉపేందర్ భార్యను కొట్టేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. అక్కడే ఇంటి అరుగుపై కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లగా తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కూతురు(7) చెప్పింది. ఈ విషయమై నాగమణి తన తండ్రితో కలసి భర్తను నిలదీయగా వారిపైనా చేయిచేసుకున్నాడు. దీంతో.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన భర్తపై చర్య తీసుకోవాలని కోరుతూ నాగమణి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉపేందర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి.కరుణాకర్ తెలిపారు. -
టీచర్ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఉపాధ్యాయుడు మందలించడంతో.. మనస్తాపానికి గురైన తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోత్కూరులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఒర్సు ఉపేందర్(14) లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో ఈ రోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో.. ఉపాధ్యాయుడు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపేందర్ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఉపాధ్యాయుడు మందలించడం వల్లే పురుగుల మందు తాగాడని ఆగ్రహించిన బంధువులు, స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. -
స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు..
యువకుల మధ్య ఘర్షణ స్నేహితుడి చెల్లెలు అని మధ్యలో వెళ్లినందుకు.. కత్తెరతో పొడిచి చంపారు.. సూర్యాపేటలో ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ: స్నేహితుడి చెల్లెలిని కొందరు వేధిస్తుండడంతో.. ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గుర య్యాడు. స్నేహితుడికి సహాయం చేద్దామని వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం రాత్రి జరిగింది. పట్టణంలోని గౌండ్ల బజార్‌కు చెం దిన మాందాస్ లక్ష్మి-సాయిలు కుమారుడు ఉపేందర్(21) కిరాణం దుకాణంలో గుమస్తా. ఆదివారం దుకాణానికి సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. కాగా, అదే వీధికి చెందిన తన స్నేహితుడు నాగరాజు చెల్లెల్ని పట్టణంలోని పీఎస్సార్ సెంటర్, రాజీవ్‌నగర్ (బర్లపెంట బజార్)కు చెందిన కొందరు యువకులు వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న ఉపేందర్‌కు చెప్పి అతడితోపాటు మరో నలుగురు స్నేహితులను తీసుకొని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల శివాలయం వద్దకు చేరుకున్నా రు. అప్పటికే శివాలయం వద్ద ఉన్న వేధింపులకు పాల్పడిన యువకులు వెంటనే వీరిపై దాడికి దిగారు. ఇరువర్గాల యువకుల మధ్య పెనుగులాట జరి గింది. దీని నుంచి తేరుకున్న నాగరాజు, స్నేహితులు అక్కడి నుంచి పారిపోగా ఉపేందర్‌పై అప్పటికే పిడిగుద్దుల వర్షం కురిపించడంతో కింద పడిపోయాడు. ఇదే క్రమంలో వేధింపులకు పాల్పడుతున్న యువకుల్లో ఒకరు శివాలయానికి సమీపంలో గల బార్బర్ దుకాణంలోని కత్తెరను తెచ్చి, సొమ్మసిల్లి కిందపడిపోయిన ఉపేందర్ గుండెల్లోకి పొడిచాడు. దీంతో అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. -
రూ.8 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ
ఘట్కేసర్ మండలం బోడుప్పల్-మారుతీనగర్‌కు చెందిన చేర్యాల ఉపేందర్ గౌడ్ అనే చిట్టీల వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. ఎవరికీ తెలియకుండా రూ.8 కోట్ల చిట్టీల సొమ్ముతో ఉడాయించాడు. దీంతో బాధితులు ఉపేందర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి కర్మ నిర్వహిస్తూ మరణించిన కుమారుడు
తల్లికి కర్మకాండలు చేస్తూ ఓ యువకుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన పులకాని లలితమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతి చెందిన నాటి నుంచి ఆమె కుమారుడు ఉపేందర్(27) తీవ్ర మనోవేదనతో ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఆమె కర్మకాండలు ఏర్పాటు చేశారు. కర్మకాండలు నిర్వహిస్తున్న ఉపేందర్ తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
దేవుడోలె ఆదుకుంటారని..
కష్టాలు లేని, రాని మనిషులుంటారా..? కచ్చితంగా ఉండరు. కానీ కక్షకట్టి దాడిచేసినట్టు.. ఒకదాని తర్వాత ఒకటిగా మీదనొచ్చి పడితే తట్టుకోవడం సాధ్యమా.. ఎంతమాత్రమూ కాదు. అందులోనూ ఖరీదైన జబ్బుల రూపంలో వచ్చి పట్టిపీడిస్తే..? అదీ రోజుకూలి చేసుకుని బతుకుబండిని లాగే పేదలైతే.. నిత్యం నరకమే. కానీ ఇదే జరిగింది ఉప్పలయ్యకు.. ఒకదాన్నుంచి తెరిపి లభించిందనుకునేలోపే.. మరొటి.. ఆ వెంటనే ఇంకోటి. తట్టుకోలేకపోయాడు. చివరికి మంచం పట్టాడు. పాపం చిన్నారి రుషికేష్కూ అంతే. ఆడిపాడాల్సిన వయసులో.. ముద్దుముద్దు మాటలతో ఇంట్లో నవ్వులు పూయించాల్సిన చిరుప్రాయంలో తలసేమియాతో మంచానికే పరిమితమయ్యాడు. సాధ్యమా.. వీరిని చూస్తూ తట్టుకోవడం సాధ్యమా.. దేవుడిలా వచ్చి దాతలు ఆదుకుంటారని, ఆపన్నహస్తం అందించి ఆదుకుంటారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి ఈ విధివంచిత కుటుంబాలు. తలసేమియాతో తల్లడిల్లుతున్న బాలుడు మహబూబాబాద్ : మానుకోటకు చెందిన బొడ్డుపెల్లి ఉపేందర్, అరుణ దంపతులది నిరుపేద కుటుంబం. ఉపేందర్ హోంగార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరున్నరేళ్ల క్రితం కుమారుడు రుషికేష్ జన్మించడంతో సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పుట్టిన కొన్ని రోజులకే బాబుకు అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది గుండెలు పిండేసే విషయం. చిన్నారి తలసేమియాతో బాధపడుతున్నాడని, నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. బాబును బతికించుకునేందుకు హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడి రెడ్‌క్రాస్ సొసైటీలో ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నారు. అయితే మందులు, రవాణా చార్జీలు కలిపి ప్రతినెల ఐదువేల రూపాయల వరకు అవుతున్నాయని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు విధులకు హాజరుకాకుంటే వేతనంలో కోత పెడుతున్నారని వాపోతున్నాడు. వస్తున్న వేతనం బాలుడి వైద్యానికే ఖర్చవుతుండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కన్నీరు పెట్టుకున్నాడు. మంచానికే పరిమితం రోజులు గడుస్తున్న కొద్దీ రుషికేష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. బాలుడి తల్లి నిత్యం దగ్గరుండి సేవలందిస్తున్నా పరిస్థితిలో మా త్రం ఇసుమంతైనా మార్పులేదు. ఇంట్లో చెంగుచెంగున ఎగురుతూ సందడి చేయాల్సిన కొడుకు ఇలా మంచానికే పరిమితమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్రాసులోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో రుషికేష్‌కు బోన్‌మారో ఆపరేషన్ చేయిస్తే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉందని, ఇందుకు రూ.25లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నారు. డబ్బులు సమకూర్చుకునేందుకు ఏడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్కరిని చేతులు జోడించి అర్థిస్తున్నా రు. తమకు ఏ ఆధారం లేకపోవడంతో అప్పు ఇచ్చేందుకు అందరూ వెనుకాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదోళ్లకి ఖరీదైన జబ్బు రాకూడదంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. -
ఆనందం.. ఆపై విషాదం
ఖమ్మం రూరల్/కూసుమంచి: ఖమ్మంలో ఘోరం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువ దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వారి కుటుంబీకులు తెలిపిన ప్రకారం... కూసుమంచి మండలం చౌటపల్లికి చెందిన సోమనబోయిన ఉపేందర్(30), మమత(28) దంపతులు. వీరిద్దరూ శుక్రవారం చౌటపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ సమీపంలో వీరి వాహనాన్ని, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన ఉపేందర్, మమత మీద నుంచి ఆ లారీ దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న వీరిద్దరినీ, అక్కడికి సమీపంలోని పెట్రోల్ బంకు వద్దనున్న 108 సిబ్బంది వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మమత మృతిచెందింది. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటి తరువాత ఉపేందర్ కూడా మృతిచెందాడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం, ఎస్ఐ లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగంలో చేరేందుకు ఆనందంగా వెళుతూ.. ఉపేందర్‌కు, నల్గొండ జిల్లా చివ్వెంలకు చెందిన మమతతో 2011లో వివాహమైంది. ఉపేందర్ ఎంఎస్సీ బీఈడీ, మమత బీఎస్సీ పూర్తిచేశారు. వీరిద్దరూ నర్శింహులగూడెంలో ప్రయివేటు పాఠశాల నెలకొల్పారు. నిర్వహణాపరమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యల కారణంగా ఈ పాఠశాలను నెల రోజుల కిందట వేరే వారికి అప్పగించారు. అప్పటి నుంచి ఖమ్మంలోని ప్రైవేట్ పాల కేంద్రంలో సూపర్వైజర్గా ఉపేందర్ పనిచేస్తున్నాడు. అక్కడే మమతకు కూడా ఉద్యోగం చూశాడు. శుక్రవారమే ఆమె విధుల్లో చేరాల్సుంది. ‘ఒకేచోట ఉద్యోగం చేయబోతున్నామన్న ఆనందంతో వారిద్దరూ శుక్రవారం ఉదయం చౌటపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం బయల్దేరారు. మమత గర్భవతి కావడంతో ఆస్పత్రికి కూడా వెళ్లాలనుకున్నారు’ అని, వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ చెప్పారు. కొడుకా... మేమెలా బతకాలి.. ఉపేందర్‌కు తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నా రు. ‘ఇంటికి పెద్ద దిక్కువు నువ్వే లేకపోతే నీ తమ్ముడు, మేము ఎలా బతకాలిరా..’ అంటూ, ఆస్పత్రిలో ఉపేందర్ తల్లిదండ్రులు గుండలెవిసేలా రోదించారు. క్రితం రోజే జన్మదిన వేడుక... ఉపేందర్-మమతది అన్యోన్య దాంపత్యమని బంధువులు, స్థానికులు చెప్పారు. ‘గురువారం రోజే మమత పుట్టిన రోజు. ఆ మరుసటి రోజునే ఆమె ఉద్యోగంలో చేరనుంది. త్వరలోనే తల్లి కూడా కాబోతోంది. ఇలా, సంతోషాలన్నీ ఒకేసారి రావడంతో.. పుట్టిన రోజు వేడుకను అందరం ఆనందంగా జరుపుకున్నాం’ అని, ఉపేందర్-మమత దంపతుల కుటుంబీకులు రోదిస్తూ చెప్పారు. వృతదేహాలను చూసేందుకు ఖమ్మం ఆస్పత్రికి చౌటపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
కన్నీటి వీడ్కోలు..
పాల్వంచ : అంతా ఓ పీడకలలా జరిగిపోయింది.. ఎంతో సంతోషంగా విజ్ఞాన యాత్రకు వెళ్లిన తల్లాడ ఉపేందర్ నిర్జీవంగా ఇంటికి చేరాడు. గత ఆదివారం హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతయిన 25 మంది విద్యార్థులలో ఉపేందర్ కూడా ఉండటంతో అతడి జాడ కోసం నాటినుం చి ఆ కుటుంబసభ్యులు ఆవేదనతో ఎదురుచూశారు. చివరకు గురువారం మృతదేహం లభ్యం కావడంతో అక్కడే ఉన్న తండ్రి, ఇక్కడ ఇంటి వద్ద ఉన్న తల్లి, తమ్ముడు ఇతర కుటుం బసభ్యులు బోరున విలపించారు. శుక్రవారం సాయంత్రం ఉపేందర్ మృతదేహం స్వగ్రామమైన గట్టాయిగూడెం(పాల్వంచ) చేరడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది. ‘బాబూ.. ఎప్పుడూ ఎంతో సంతోషంగా అమ్మను చూడాలని వస్తా వు.. ఒక్కసారి చూడరా..’ అంటూ తల్లి శ్రీదేవి విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. తండ్రి శ్రీనివాస్, తమ్ముడు మహేష్, నానమ్మ సువర్ణ, ఇతర బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇంటికి చేరిన మృతదేహం... గురువారం ఉదయం బియాస్ నదిలో లభించిన మృతదేహం ఉపేందర్‌దేనని కొడుకు జాడ కోసం అక్కడే వేచి చూస్తున్న తండ్రి శ్రీనివాస్ గుర్తుపట్టారు. సాయంత్రం అక్కడి నుంచి మండి మీదుగా ఢిల్లీ వరకు రోడ్డు మార్గాన తీసుకొచ్చా రు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకోగానే ప్రత్యేక జెట్ విమానంలో 11.30 గం ట లకు హైదరాబాద్ తీసుకొచ్చారు. మృతదేహాన్ని అధికారికంగా స్వీకరించేందుకు అప్పటికే అక్కడ ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, తహశీల్దార్ సమ్మిరెడ్డి భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి శ్రీనివాస్‌ను ఓదార్చారు. అనంతరం తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో సాయంత్రం 6.30 గంటలకు పాల్వంచకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అందజేశారు. భారీగా తరలివచ్చిన స్థానికులు .. బియాస్ నదిలో గల్లంతయిన వారిలో పాల్వం చకు చెందిన ఉపేందర్ ఉండటం స్థానికంగా చర్చంశనీయంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఉపేందర్ మృతదేహం వస్తుందని తెలుసుకున్న స్థానికులు వందలాది మంది మధ్యాహ్నం నుంచే శ్రీనివాస్ ఇంటికి చేరుకుని వేచి చేశారు. అయితే ఉపేందర్ చనిపోయి ఐదు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. దీంతో అధికారులు ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా భద్రపరచి ఇక్కడి తరలించారు. మృతదేహాన్ని చూసే అదృష్టం కూడా లేదని కుటుంబసభ్యులు విలపించారు. మృతదేహానికి పలువురి నివాళి... ఉపేందర్ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకులు వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తహశీల్దార్ సమ్మిరెడ్డి, టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని), సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదర్చారు. ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబసభ్యులతో పాటు భారీగా తరలివచ్చిన బంధువులు, స్థానికుల రోదనల నడుమ పాండురంగాపురం రోడ్‌లోని హిందూ శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు. -
బాబూ వెళ్లిపోయావా...
పాల్వంచ: ఐదురోజులుగా కొడుకు ఆచూకీ కోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న ఆ తల్లికి దుర్వార్త చేరనే చేరింది. చదువుకోడానికని ఎంతో ఆనందంగా వెళ్లిన బిడ్డ శవమై వస్తున్నాడని తెలిసి కుప్పకూలిపోయింది. నవ్వుతూ తుళ్లుతూ తనతోపాటు తిరిగిన అన్న ఇక లేడని తెలిసిన ఆతమ్ముడు రోదిస్తున్న తీరు అంతాఇంతా కాదు. చిన్నప్పటి నుంచి గారాలుపోయిన మనవడు ఇక తనకు కనపడడని తెలిసిన నానమ్మ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీప్రమాదంలో గల్లంతయిన పాల్వంచ విద్యార్థి తల్లాడ ఉపేందర్ ఇంటివద్ద గురువారం పరిస్థితి ఇది. ఉపేందర్ నదిలో గల్లంతయ్యాడని తెలిసిన వెంటనే తండ్రి శ్రీనివాస్ సంఘటనాస్థలానికి వెళ్లి అక్కడే ఉన్నారు. పాల్వంచ గట్టాయిగూడెంలోని ఇంటివద్ద తల్లి శ్రీదేవి, నాన మ్మ సువర్ణ, తమ్ముడు మహేష్ ఉన్నారు. ఐదురోజులుగా వారు టీవీకే అతుక్కుపోయారు. ఏ క్షణానయిన ఉపేందర్ ఆచూకీ తెలుస్తుందని ఎదురుచూస్తున్నారు. ఓ వృుతదేహం లభ్యమయిందని, అది ఉపేందర్‌దేనని గురువారం వార్తలు రావడంతో వారిలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇంకా ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ఆశ నీరుగారిపోవడంతో వారు రోదిస్తున్న తీరు స్థానికుల కంట తడిపెట్టించింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నామని, కానీ ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోతాడనుకోలేదని వారు విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. కాగా, వరద ఉధృతిలో డ్యాం నుంచి చాలా దూరం వరకు కొట్టుకుపోయి బండరాళ్ల కింద మట్టిలో కూరుకు పోయిన ఉపేందర్ వృుతదేహాన్ని గజ ఈతగాళ్లు కనిపెట్టారు. కంటిమీద కునుకు లేకుండా అక్కడే ఎదురు చేస్తున్న తండ్రి శ్రీనివాస్ కుమారుని వృుతదేహాన్ని గుర్తించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. లార్జీ డ్యాంకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో నీటి అడుగుభాగాన ఉన్న వృుతదేహాన్ని వెలికి తీశారని విలపిస్తూ చెప్పారు. సాయంత్రం 6 గంటలకు మండి నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గాన బయలు దేరామని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వస్తామని, హైదరాబాద్ నుంచి పాల్వంచకు రోడ్డు మార్గాన వస్తామని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి గాని శనివారం ఉదయానికి గాని చేరుకునే అవకాశం ఉందని అన్నారు. -
ఆ మృతదేహం ఉపేందర్దే....
పాల్వంచ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయిన విద్యార్థి తల్లాడ ఉపేందర్ మృతదేహాన్ని వెలికి తీశారు. గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బంది గురువారం రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఉపేందర్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు గుర్తించారు. విహార యాత్రకు వెళ్లిన కుమారుడు చివరికి విగత జీవిగా మారటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా విలపించారు. కాగా ఉపేందర్ తండ్రి తల్లాడ శ్రీనివాస్ స్థానికంగా కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. చిన్నకొడుకు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా పెద్ద కొడుకు ఉపేందర్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈలో ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక కృష్ణగౌతమి పాఠశాలలో చదివిన ఉపేందర్.... తోటి విద్యార్థులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు చదువులో ప్రతిభ కనబరుస్తు ఉండేవాడని ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ తెలిపారు. ఉపేందర్ హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ వద్ద గల జెఎన్టియు కళాశాలలో డిప్లొమో చదివాడని, ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలలో సీటు లభించిందని పిన్ని పద్మ తెలిపింది. ఇలా చదువులో మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఉపేందర్ ప్రమాదబారిన పడడంతో అతను చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్లో, తోటి స్నేహితుల్లోనూ విషాదం అలముకుంది. -
కన్నీటితో...ఎదురు చూపులు
ఖమ్మం క్రైం/పాల్వంచ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన ఇంజినీరింగ్ విద్యార్థుల ఆచూకీ లభ్యంకాకపోవడంతో వారి తల్లిదండ్రులకు కన్నీటి ఎదురు చూపులు తప్పడం లేదు. గల్లంతయిన విద్యార్థులలో ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్, పాల్వంచకు చెందిన తల్లాడ ఉపేందర్ ఉన్నారు. సంఘటన జరిగి మూడురోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో ఆఇద్దరు విద్యార్థుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కిరణ్‌కుమార్ తండ్రి వెంకటరమణ బరువెక్కిన హృదయంతో సోమవారం హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. అక్కడ ఆయన తన కుమారుడి సమాచారం కోసం అధికారులతో మాట్లాడారు. కిరణ్ తల్లి పద్మావతి, బంధువులు అంతా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులకు ఫోన్లు చేసి తమబిడ్డ గురించి వారు ఆరా తీస్తున్నారు. ఇతర విద్యార్థుల మృత దేహాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో కిరణ్‌కుమార్ సృ్మతులను తలుచుకొని మరింతగా రోదిస్తున్నారు. రియల్‌హీరో కిరణ్.... ఒకవైపు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ నెట్టివేస్తున్నా మొండి పట్టుదలతో నలుగురు స్నేహితులకు చేయిని అందించి పైకి చేర్చాడు కిరణ్‌కుమార్. తాను మాత్రం ప్రవాహంలో కలిసిపోయాడు. ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు కిరణ్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ హైదరాబాద్‌లో కన్నీరు కార్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కిరణ్ తండ్రి వెంకటరమణ బంధువులతో మాట్లాడుతూ తన కుమారుడు నలుగురిని కాపాడటం గర్వంగా ఉన్నా... ఇక తిరిగి రాడని తెలిసి తట్టుకోలేకపోతున్నామన్నారు. కిరణ్ ఎంతో ధైర్యవంతుడని, చిన్నప్పటి నుంచి పక్కవారికి సేవ చేసే స్వభావం కలవాడని బంధువులు పేర్కొన్నారు. ఈ టూర్‌కు కూడా దాదాపు లీడర్‌గా వ్యవహరించాడని, ఈ మధ్య విడుదలైన కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేసినట్లు ఫేస్బుక్లో పెట్టాడని తెలిపారు. చివరిగా తన ఫేస్బుక్లో అందరూ సంప్రదాయబద్దంగా ఉండాలని పోస్ట్ చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడని, కిరణ్ సాహసానికి, త్యాగానికి సెల్యూట్ చేయకుండా ఉండలేమన్నారు. దుఃఖ సాగరంలో ఉపేందర్ కుటుంబం.. విషాద సంఘటన చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తున్నా గల్లంతయిన పాల్వంచ విద్యార్ధి తల్లాడ ఉపేందర్ ఆచూకీ కూడా తెలియరాలేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న అతని తల్లి శ్రీదేవి, నానమ్మ సువర్ణ, బంధువులు ఆవేదన చెందుతున్నారు. వారు విలపిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది. అక్కడి అధికారులు, గజ ఈతగాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పకప్పుడు టీవిల్లో చూస్తూ తమబిడ్డ సురక్షితంగా రావాలని కోరుకుంటున్నారు. ఉపేందర్ గల్లంతయిన సమాచారం అందుకున్న తండ్రి శ్రీనివాస్ హిమాచల్ ప్రదేశ్‌కు సోమవారం వెళ్లి ఇంకా అక్కడే ఉన్నారు. కొడుకు ఆచూకీ లభించక పోవడంతో అక్కడ శ్రీనివాస్ రోదిస్తూ గడుపుతున్నాడని బంధువులు తెలిపారు. ఎప్పటికప్పుడు కొడుకు సమాచారం కోసం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఉపేందర్కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఫోన్లో ఓదార్చారు. విషాదంలో పరీక్షలు రాస్తున్న తమ్ముడు మహేష్.. వరంగల్‌లో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉపేందర్ సోదరుడు మహేష్ విషాదంతోనే అక్కడ పరీక్షలకు హాజరవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అన్న జాడ తెలియడం లేదని బెంగ ఉన్నా.. ఇక్కడ తల్లి దుఃఖసాగరంలో ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎంతో కష్టపడి చదివిస్తున్నాం.. గత ఏడాది నా భర్త పుల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు. ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాం. అయినా బంధువుల సహాయ సహకారాలతో మనుమళ్ళు ఉపేందర్, మహేష్‌లను చదివిస్తున్నాం. మంచి ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటా నానమ్మ అంటు ఉపేందర్ చెప్పేవాడు. మూడు రోజులు గడుస్తున్నా అతని ఆచూకి తెలియడం లేదు. ఆందోళనగా ఉంది. - సువర్ణ, నానమ్మ -
ఎంత పనిచేశావు బిడ్డా...
కొడుకుని తలచుకుని విలపిస్తున్న ఉపేందర్ తల్లి శ్రీదేవి పాల్వంచ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయిన విద్యార్థుల్లో పాల్వంచకు చెందిన విద్యార్థి ఉండడంతో కుటుంబసభ్యులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక గట్టాయిగూడెంలో నివాసం ఉంటున్న కాంట్రాక్టర్ తల్లాడ శ్రీనివాస్ పెద్ద కుమారుడు ఉపేందర్ ప్రమాదంలో చిక్కుకున్నాడనే వార్త ఇక్కడివారికి మింగుడుపడడంలేదు. రెండు రోజుల క్రితమే తన బిడ్డ ఫోన్ చేసి తాము విహారయాత్రలో బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాడని, మరుసటి రోజే గల్లంతయ్యాడనే వార్త వినాల్సి వచ్చిందని ఉపేందర్ తల్లి శ్రీదేవి విలపిస్తున్న తీరు వర్ణనాతీతంగా ఉంది. అంతటా విషాదం... ఉపేందర్ తండ్రి తల్లాడ శ్రీనివాస్ స్థానికంగా కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. చిన్నకొడుకు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా పెద్ద కొడుకు ఉపేందర్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈలో ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. శ్రీనివాస్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇంటి వద్ద ఓ కార్యక్రమానికి వెళ్లి అక్కడే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో తమ కుమారుడు ఉపేందర్ గల్లంతయ్యాడనే విషయం ఆయనకు అక్కడే తెలిసింది. టీవీల ద్వారా దుర్ఘటన విషయం తల్లి శ్రీదేవికి కూడా తెలియడంతో పాల్వంచలో ఉన్న ఆమె కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు వేరే ప్రాంతంలో ఉండటంతో ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ కుమారుడి జాడ కోసం ఆమె ఎదురుచూడటం అక్కడికి వచ్చిన వారిని కలిచివేసింది. పాల్వంచ విద్యార్థి ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానికులు, బంధువులకు తెలిసి పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. ఉపేందర్ గల్లంతు కావడం, ఆచూకీ లభించకపోవడంతో అందరిలో విషాదం నెలకొంది. గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన వారి మృతదేహాలను ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్న వార్తలు టీవిల్లో వస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళనలో అంతా మునిగిపోయారు. చివరికి రెండోరోజు చేస్తున్న గాలింపులో కూడా ఉపేందర్ ఆచూకీ లభించక పోవడంతో మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఉన్న ఉపేందర్ తండ్రి శ్రీనివాస్ సోమవారం ఉదయమే విజ్ఞాన జ్యోతి కళాశాలకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్‌కు సోమవారం మధ్యాహ్నం బయలు దేరి వెళుతున్నట్లు శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవో,మున్సిపల్ కమిషనర్ ఉపేందర్ కుటుంబాన్ని పాల్వంచ ఆర్డీవో ఎన్. సత్యనారాయణ పరామర్శించారు. కుమారుని ఆచూకీ లభించే వరకు గుండె నిబ్బరం చేసుకుని ఉండాలని తల్లి శ్రీదేవిని ఓదార్చారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, ప్రభుత్వం ద్వారా కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు. మునిసిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ కూడా ఉపేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. మొదటి నుంచీ ప్రతిభావంతుడు... ‘చిన్న నాటి నుంచీ తెలివిగలవాడే...’ ‘భవిష్యత్తులో ఎంతోఎత్తుకు ఎదుగుతాడనిఅనుకున్నాం...’ ‘అయ్యో...ఆ తలిదండ్రుల ఆశలపై గంగమ్మ నీళ్లు చల్లింది’ ఉపేందర్ ఇంటి వద్ద సోమవారం విషాదవాతావరణం నెలకొనగా, బంధుమిత్రులు మాట్లాడుకున్న మాటలు ఇవి. ఉపేందర్ ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక కృష్ణగౌతమి పాఠశాలలో చదువు కున్నాడు. తోటి విద్యార్థులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు చదువులో ప్రతిభ కనబరుస్తు ఉండేవాడని ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ తెలిపారు. పదోతరగతిలో 531 మార్కులు సాధించాడని అన్నారు. ఈసెట్‌లో కూడా 64వ ర్యాంకు సాధించాడని తెలిపారు. హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ వద్ద గల జెఎన్టియు కళాశాలలో డిప్లొమో చదివాడని, ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలలో సీటు లభించిందని పిన్ని పద్మ తెలిపింది. ఇలా చదువులో మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఉపేందర్ ప్రమాదబారిన పడడంతో అతను చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్లో, తోటి స్నేహితుల్లోనూ విషాదం అలముకుంది.