ఎంత పనిచేశావు బిడ్డా... | Concern in the student's parents | Sakshi
Sakshi News home page

ఎంత పనిచేశావు బిడ్డా...

Published Tue, Jun 10 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఎంత పనిచేశావు బిడ్డా...

ఎంత పనిచేశావు బిడ్డా...

కొడుకుని తలచుకుని విలపిస్తున్న ఉపేందర్ తల్లి శ్రీదేవి
 
 పాల్వంచ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయిన విద్యార్థుల్లో పాల్వంచకు చెందిన విద్యార్థి ఉండడంతో కుటుంబసభ్యులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక గట్టాయిగూడెంలో నివాసం ఉంటున్న కాంట్రాక్టర్ తల్లాడ శ్రీనివాస్ పెద్ద కుమారుడు ఉపేందర్ ప్రమాదంలో చిక్కుకున్నాడనే వార్త ఇక్కడివారికి మింగుడుపడడంలేదు. రెండు రోజుల క్రితమే తన బిడ్డ ఫోన్ చేసి తాము విహారయాత్రలో బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాడని,  మరుసటి రోజే గల్లంతయ్యాడనే వార్త వినాల్సి వచ్చిందని ఉపేందర్ తల్లి శ్రీదేవి   విలపిస్తున్న తీరు వర్ణనాతీతంగా ఉంది.
 
అంతటా విషాదం...
ఉపేందర్ తండ్రి తల్లాడ శ్రీనివాస్ స్థానికంగా కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. చిన్నకొడుకు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా పెద్ద కొడుకు ఉపేందర్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈలో ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు.  శ్రీనివాస్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇంటి వద్ద ఓ కార్యక్రమానికి వెళ్లి అక్కడే ఉన్నారు.   హిమాచల్ ప్రదేశ్‌లో  తమ కుమారుడు ఉపేందర్ గల్లంతయ్యాడనే విషయం ఆయనకు అక్కడే తెలిసింది.
 
టీవీల ద్వారా దుర్ఘటన విషయం తల్లి శ్రీదేవికి కూడా తెలియడంతో పాల్వంచలో ఉన్న ఆమె కన్నీటి పర్యంతమైంది.   కుటుంబ సభ్యులు వేరే ప్రాంతంలో ఉండటంతో ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ కుమారుడి జాడ కోసం ఆమె ఎదురుచూడటం అక్కడికి వచ్చిన వారిని కలిచివేసింది.   పాల్వంచ విద్యార్థి ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానికులు, బంధువులకు తెలిసి పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు.  ఉపేందర్ గల్లంతు కావడం, ఆచూకీ లభించకపోవడంతో అందరిలో విషాదం నెలకొంది.
 
గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన వారి మృతదేహాలను ఒక్కొక్కటి  బయటకు తీసుకొస్తున్న వార్తలు టీవిల్లో వస్తుండటంతో  ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళనలో అంతా మునిగిపోయారు. చివరికి రెండోరోజు చేస్తున్న గాలింపులో కూడా ఉపేందర్ ఆచూకీ  లభించక పోవడంతో మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా,  హైదరాబాద్‌లో ఉన్న ఉపేందర్ తండ్రి  శ్రీనివాస్ సోమవారం ఉదయమే  విజ్ఞాన జ్యోతి కళాశాలకు వెళ్లారు. అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్‌కు సోమవారం మధ్యాహ్నం బయలు దేరి వెళుతున్నట్లు శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
 
కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవో,మున్సిపల్ కమిషనర్
ఉపేందర్ కుటుంబాన్ని పాల్వంచ ఆర్డీవో ఎన్. సత్యనారాయణ పరామర్శించారు.  కుమారుని ఆచూకీ లభించే  వరకు గుండె నిబ్బరం చేసుకుని ఉండాలని తల్లి శ్రీదేవిని ఓదార్చారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, ప్రభుత్వం ద్వారా కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు. మునిసిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ కూడా ఉపేందర్ కుటుంబాన్ని పరామర్శించారు.
 
 మొదటి నుంచీ ప్రతిభావంతుడు...

 
 ‘చిన్న నాటి నుంచీ తెలివిగలవాడే...’
 ‘భవిష్యత్తులో ఎంతోఎత్తుకు ఎదుగుతాడనిఅనుకున్నాం...’
 ‘అయ్యో...ఆ తలిదండ్రుల ఆశలపై గంగమ్మ నీళ్లు చల్లింది’
 
ఉపేందర్ ఇంటి వద్ద సోమవారం విషాదవాతావరణం నెలకొనగా, బంధుమిత్రులు మాట్లాడుకున్న మాటలు ఇవి. ఉపేందర్ ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక కృష్ణగౌతమి పాఠశాలలో చదువు కున్నాడు. తోటి విద్యార్థులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు చదువులో ప్రతిభ కనబరుస్తు ఉండేవాడని ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ  తెలిపారు.

పదోతరగతిలో 531 మార్కులు సాధించాడని అన్నారు. ఈసెట్‌లో కూడా 64వ ర్యాంకు సాధించాడని తెలిపారు.  హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ వద్ద గల జెఎన్‌టియు కళాశాలలో డిప్లొమో చదివాడని, ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలలో సీటు లభించిందని పిన్ని పద్మ తెలిపింది. ఇలా చదువులో మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఉపేందర్ ప్రమాదబారిన పడడంతో అతను చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్లో, తోటి స్నేహితుల్లోనూ విషాదం అలముకుంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement