కన్నీటి వీడ్కోలు..
పాల్వంచ : అంతా ఓ పీడకలలా జరిగిపోయింది.. ఎంతో సంతోషంగా విజ్ఞాన యాత్రకు వెళ్లిన తల్లాడ ఉపేందర్ నిర్జీవంగా ఇంటికి చేరాడు. గత ఆదివారం హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతయిన 25 మంది విద్యార్థులలో ఉపేందర్ కూడా ఉండటంతో అతడి జాడ కోసం నాటినుం చి ఆ కుటుంబసభ్యులు ఆవేదనతో ఎదురుచూశారు. చివరకు గురువారం మృతదేహం లభ్యం కావడంతో అక్కడే ఉన్న తండ్రి, ఇక్కడ ఇంటి వద్ద ఉన్న తల్లి, తమ్ముడు ఇతర కుటుం బసభ్యులు బోరున విలపించారు.
శుక్రవారం సాయంత్రం ఉపేందర్ మృతదేహం స్వగ్రామమైన గట్టాయిగూడెం(పాల్వంచ) చేరడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది. ‘బాబూ.. ఎప్పుడూ ఎంతో సంతోషంగా అమ్మను చూడాలని వస్తా వు.. ఒక్కసారి చూడరా..’ అంటూ తల్లి శ్రీదేవి విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. తండ్రి శ్రీనివాస్, తమ్ముడు మహేష్, నానమ్మ సువర్ణ, ఇతర బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
ఇంటికి చేరిన మృతదేహం...
గురువారం ఉదయం బియాస్ నదిలో లభించిన మృతదేహం ఉపేందర్‌దేనని కొడుకు జాడ కోసం అక్కడే వేచి చూస్తున్న తండ్రి శ్రీనివాస్ గుర్తుపట్టారు. సాయంత్రం అక్కడి నుంచి మండి మీదుగా ఢిల్లీ వరకు రోడ్డు మార్గాన తీసుకొచ్చా రు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకోగానే ప్రత్యేక జెట్ విమానంలో 11.30 గం ట లకు హైదరాబాద్ తీసుకొచ్చారు. మృతదేహాన్ని అధికారికంగా స్వీకరించేందుకు అప్పటికే అక్కడ ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, తహశీల్దార్ సమ్మిరెడ్డి భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి శ్రీనివాస్‌ను ఓదార్చారు. అనంతరం తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో సాయంత్రం 6.30 గంటలకు పాల్వంచకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అందజేశారు.
భారీగా తరలివచ్చిన స్థానికులు ..
బియాస్ నదిలో గల్లంతయిన వారిలో పాల్వం చకు చెందిన ఉపేందర్ ఉండటం స్థానికంగా చర్చంశనీయంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఉపేందర్ మృతదేహం వస్తుందని తెలుసుకున్న స్థానికులు వందలాది మంది మధ్యాహ్నం నుంచే శ్రీనివాస్ ఇంటికి చేరుకుని వేచి చేశారు. అయితే ఉపేందర్ చనిపోయి ఐదు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. దీంతో అధికారులు ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా భద్రపరచి ఇక్కడి తరలించారు. మృతదేహాన్ని చూసే అదృష్టం కూడా లేదని కుటుంబసభ్యులు విలపించారు.
మృతదేహానికి పలువురి నివాళి...
ఉపేందర్ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తహశీల్దార్ సమ్మిరెడ్డి, టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని), సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదర్చారు. ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబసభ్యులతో పాటు భారీగా తరలివచ్చిన బంధువులు, స్థానికుల రోదనల నడుమ పాండురంగాపురం రోడ్‌లోని హిందూ శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు.