బాబూ వెళ్లిపోయావా... | Concern in the student's parents | Sakshi
Sakshi News home page

బాబూ వెళ్లిపోయావా...

Published Fri, Jun 13 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

బాబూ వెళ్లిపోయావా...

బాబూ వెళ్లిపోయావా...

 పాల్వంచ: ఐదురోజులుగా కొడుకు ఆచూకీ కోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న ఆ తల్లికి దుర్వార్త చేరనే చేరింది. చదువుకోడానికని ఎంతో ఆనందంగా  వెళ్లిన బిడ్డ శవమై వస్తున్నాడని తెలిసి కుప్పకూలిపోయింది. నవ్వుతూ తుళ్లుతూ తనతోపాటు తిరిగిన అన్న ఇక లేడని తెలిసిన ఆతమ్ముడు రోదిస్తున్న తీరు అంతాఇంతా కాదు. చిన్నప్పటి నుంచి గారాలుపోయిన మనవడు ఇక తనకు కనపడడని తెలిసిన నానమ్మ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీప్రమాదంలో గల్లంతయిన పాల్వంచ విద్యార్థి తల్లాడ ఉపేందర్ ఇంటివద్ద గురువారం పరిస్థితి ఇది.
 
ఉపేందర్ నదిలో గల్లంతయ్యాడని తెలిసిన వెంటనే తండ్రి  శ్రీనివాస్ సంఘటనాస్థలానికి వెళ్లి అక్కడే ఉన్నారు. పాల్వంచ గట్టాయిగూడెంలోని ఇంటివద్ద  తల్లి శ్రీదేవి, నాన మ్మ సువర్ణ, తమ్ముడు మహేష్ ఉన్నారు. ఐదురోజులుగా వారు టీవీకే అతుక్కుపోయారు. ఏ క్షణానయిన ఉపేందర్ ఆచూకీ తెలుస్తుందని ఎదురుచూస్తున్నారు. ఓ వృుతదేహం లభ్యమయిందని, అది ఉపేందర్‌దేనని గురువారం వార్తలు రావడంతో  వారిలో దుఃఖం కట్టలు తెంచుకుంది.
 
ఇంకా ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ఆశ నీరుగారిపోవడంతో వారు రోదిస్తున్న తీరు స్థానికుల కంట తడిపెట్టించింది.   ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నామని, కానీ ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోతాడనుకోలేదని వారు విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు.  కాగా,  వరద ఉధృతిలో డ్యాం నుంచి చాలా దూరం వరకు కొట్టుకుపోయి బండరాళ్ల కింద మట్టిలో కూరుకు పోయిన ఉపేందర్ వృుతదేహాన్ని  గజ ఈతగాళ్లు కనిపెట్టారు.
 
కంటిమీద  కునుకు లేకుండా అక్కడే ఎదురు చేస్తున్న తండ్రి శ్రీనివాస్ కుమారుని వృుతదేహాన్ని గుర్తించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. లార్జీ డ్యాంకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో నీటి అడుగుభాగాన ఉన్న వృుతదేహాన్ని వెలికి తీశారని విలపిస్తూ చెప్పారు. సాయంత్రం 6 గంటలకు మండి నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గాన బయలు దేరామని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వస్తామని, హైదరాబాద్ నుంచి పాల్వంచకు రోడ్డు మార్గాన వస్తామని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి గాని శనివారం ఉదయానికి గాని చేరుకునే అవకాశం ఉందని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement