ఆ మృతదేహం ఉపేందర్దే....
పాల్వంచ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయిన విద్యార్థి తల్లాడ ఉపేందర్ మృతదేహాన్ని వెలికి తీశారు. గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బంది గురువారం రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఉపేందర్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు గుర్తించారు. విహార యాత్రకు వెళ్లిన కుమారుడు చివరికి విగత జీవిగా మారటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా విలపించారు.
కాగా ఉపేందర్ తండ్రి తల్లాడ శ్రీనివాస్ స్థానికంగా కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. చిన్నకొడుకు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా పెద్ద కొడుకు ఉపేందర్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈలో ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక కృష్ణగౌతమి పాఠశాలలో చదివిన ఉపేందర్.... తోటి విద్యార్థులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు చదువులో ప్రతిభ కనబరుస్తు ఉండేవాడని ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ తెలిపారు.
ఉపేందర్ హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ వద్ద గల జెఎన్‌టియు కళాశాలలో డిప్లొమో చదివాడని, ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలలో సీటు లభించిందని పిన్ని పద్మ తెలిపింది. ఇలా చదువులో మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఉపేందర్ ప్రమాదబారిన పడడంతో అతను చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్లో, తోటి స్నేహితుల్లోనూ విషాదం అలముకుంది.