అనుమానితులకు కరోనా స్టాంప్‌ | COVID 19 Stamps on Hands to Foreign Returns | Sakshi
Sakshi News home page

‘ముద్ర’తో భద్రం!

Published Mon, Mar 23 2020 7:43 AM | Last Updated on Mon, Mar 23 2020 7:48 AM

COVID 19 Stamps on Hands to Foreign Returns - Sakshi

విదేశాల నుంచి నగరానికి వచ్చినవారి చేతులకు ముద్రలు వేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా వైద్యశాఖ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. విదేశాల నుంచి వచ్చినవారి చేతులకు ముద్రలు వేశారు. పలువురికి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 14 రోజుల వరకూ ఇళ్లనుంచి వారు బయటికి రాకూడదని సూచించారు. స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు.      

బంజారాహిల్స్‌ పరిధిలో..
బంజారాహిల్స్‌: కరోనా వ్యాపించకుండా విదేశాల నుంచి వచ్చిన వారిని, ఇంట్లో ఉంచేందుకు వీలుగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాంపింగ్‌లు వేస్తున్నారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో నాలుగు రోజుల క్రితం ఓ కుటుంబం విదేశాల నుంచి వచ్చింది. దీంతో వీరికి ఎడమ చేతికి స్టాంపింగ్‌ వేశారు. మొదట వీరు వైద్య బృందాలను లోనికి అనుమతించలేదు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకొని వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి స్టాంపింగ్‌ వేశారు. అధికారుల సూచనల మేరకు నిర్ధేశిత గడువు వరకు ఇంట్లోనే క్వారంటైన్‌గా ఉండేలా ఈ స్టాంప్‌ను వేశామని అధికారులు తెలిపారు. దీంతో బయట వీరు తిరిగిన సమయంలో వారిని సులభంగా గుర్తించే వీలుంటుందనే ఉద్దేశంతో ఇలా చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నారు. ఇంకోవైపు స్టార్‌ హోటళ్ళలో బస చేసిన విదేశీయులకు ఆదివారం కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వారు గదులు దాటి బయటకు రాకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  

మెడికల్‌ కౌన్సెలింగ్‌
మీర్‌పేట: మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో జర్మనీ నుంచి వచ్చిన విద్యార్థులకు ఆదివారం బాలాపూర్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్‌ ఎడ్ల మల్లేష్‌ ముదిరాజ్, ఆరోగ్య పర్యవేక్షకులు పి.గోవిందరెడ్డిలు వారికి పలు సూచనలు అందజేసి 14 రోజుల వరకు గృహ నిర్బంధంలో ఉండాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని, అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే తెలపాలని సూచించారు.

ఆరోగ్య పరీక్షలు..
బంజారాహిల్స్‌: కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విదేశాల నుంచి వచ్చిన కొంత మంది సహకరించడం లేదు. దీంతో పోలీసులు, వైద్య బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 16 నుంచి 21వ తేదీల మధ్యలో విదేశీయులు 21 మంది రాగా ఇందులో 11 మంది తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. మిగతావారు ఆయా ప్రాంతాల్లోని హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక మన దేశానికి చెందిన వారు విదేశాలకు వెళ్లి ఇటీవల వారం రోజుల వ్యవధిలో 31 మంది వచ్చారు. ఇందులో ఈ నెల 16వ తేదీన ఒకరు, 21వ తేదీన మరొకరు కనిపించకుండా పోయారు. ఈ ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎక్కడిక వెళ్లారన్నదానిపై బంజారాహిల్స్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచారు. అడ్రస్‌ కోసం గాలిస్తున్నారు. ఇంకోవైపు ఆయా స్టార్‌హోటళ్లలో బస చేసిన విదేశీయులకు ఆదివారం కూడా వైద్య బృందాలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాయి. వారు బయటికి రాకుండా కట్టడి చేశారు. విదేశాల నుంచి నగరానికి వచ్చిన హైదరాబాదీలను కూడా ఇంటికే పరిమితం చేశారు. వారు బయటికి రాకుండా స్టాంపింగ్‌ వేశారు. ప్రతిరోజూ వీరి కదలికలపై నిఘా ఉంచారు.  

రహమత్‌నగర్‌ డివిజన్‌లో..
రహమత్‌నగర్‌: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే భాగంగా విదేశాల నుంచి         వచ్చిన వారి నివాసాలకు వెళ్లి స్వీయ నిర్బంధం (సెల్ఫ్‌ ఐసోలేషన్‌) ఉండాలని సూచిస్తూ వారికి చేతిపై స్టాంప్‌లు వేస్తున్నారు. రహమత్‌నగర్‌ డివిజన్‌లోని బ్రహ్మశంకర్‌నగర్, శ్రీరాంనగర్, రహమత్‌నగర్‌ బస్తీలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఆదివారం జీహెచ్‌ఎసీ ఏఈ జమీల్‌ తన సిబ్బందితో కలిసి వారి నివాసాలకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. వారి చేతులపై స్టాంప్‌లను వేశారు. సర్కిల్‌ 19 పరిదిలో 58 మంది విదేశాల నుంచి వచ్చిన వారుగా గుర్తించామని, వారందరికీ సెల్ప్‌ ఐసోలేషన్‌ ఉండాలని సూచిస్తున్నామని జమీల్‌ తెలిపారు.

అనుమానితులకు కరోనా స్టాంప్‌
ఎల్‌బీనగర్‌: కరోనా వైరస్‌ దృష్ట్యా ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండేందుకు మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌–3 పరిధిలో విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం కొత్తపేట, మన్సురాబాద్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్లలో ఇప్పటి వరకు విదేశాల నుంచి  వచ్చిన వారి సంఖ్య 144 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరందరినీ అనుమానితులుగా గుర్తించి, వారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చేతికి కరోనా ముద్ర వేస్తున్నారు. దీంతో వారు బయటకు వెళ్లినా ప్రజలు గుర్తించే విధంగా ఈ ముద్రను వేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. వీరందరూ 14రోజుల పాటు ఇళ్లలోనే ఐసోలేషన్‌ వార్డులుగా పరిగణించి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఒకవేళ బయటకు వస్తే వెంటనే గుర్తించి సర్కిల్‌ అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని సర్కిల్‌ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆరోగ్య పరిస్థితిపై ఆరా..
యాకుత్‌పురా: విదేశాలకు నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నామని వైద్య విధాన పరిషత్‌ యాకుత్‌పురా–2 వైద్యాధికారిణి డాక్టర్‌ ఆయేషా ముదాషీర్‌ తెలిపారు. ఆదివారం వైద్య బృందం, పోలీసులతో కలిసి ఆమె ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన వారి ఇంటింటికి తిరుగుతూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ రాష్ట్ర మరింత వ్యాపించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం ఇంటింటికి తిరుగుతూ వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకుంటున్నామన్నారు. వైరస్‌ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ చేతులను సబ్బులు లేదా శానిటైజర్లతో కడుక్కోవాలన్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని వైద్య పరీక్షలకు తరలిస్తున్నామన్నారు.

హోం క్వారంటైన్‌పై వివరాల సేకరణ
మలక్‌పేట: కోవిద్‌–19 వ్యాప్తిని అరికట్టడానికి జీహెచ్‌ఎంసీ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  జీహెచ్‌ఎంసీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి విదేశాల నుంచి వచ్చి నగరంలోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. మూసారంబాగ్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఐఎస్‌సదన్‌ డివిజన్ల పరిధిలో ఆదివారం వారిని గుర్తించారు. వీరికి హోం క్వారంటైన్‌ స్టాంప్స్‌ వేశారు. ఇళ్ల పరిసర ప్రాంతాలలో ప్రత్యేక శానిటైజేషన్‌ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అధికారులు వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించి వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ఐషోలేషన్‌ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తామన్నారు. భయాందోళనలకు గురి కాకుండా అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అందరూ సామాజిక బాధ్యతగా సహకరించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement