మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి, పాల్గొన్న పార్టీ నాయకులు
సాక్షి, కరీంనగర్ : లౌకిక ప్రజాస్వామ్యకూటమే లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నాయని.. వాటి నిర్వాకంతో చట్ట సభలు, న్యాయ వ్యవస్థ గందరగోళంలో పడ్డాయన్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ హక్కులకు తిలోదకాలిçస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయస్థానాల్లో సైతం విపరీత జోక్యం పెరిగి న్యాయమూర్తులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, చట్టసభల్లో సభ్యులు, పార్టీలు మారుతున్నా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్న వైనం బాధాకరమన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందిపోయి అన్నింటా జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సబబు కాదని.. హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడం దేశంలోనే మొదటిసారన్నారు. రానున్న రోజుల్లో ఇరుపార్టీలకు గుణపాఠం కలిగే విధంగా వ్యవహరించడంలో ముందుంటుందన్నారు. జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సహాయకార్యదర్శులు పొనగంటి కేదారి, అందె స్వామి, నాయకులు కాల్వ నర్సయ్యయాదవ్, కూన శోభారాణి, రాజు, టేకుమల్ల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment