సమావేశంలో మాట్లాడుతున్న సురవరం. చిత్రంలో చాడ వెంకట రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో బీజేపీని ఓడించేందుకు వివిధ రాజకీయపార్టీలు కలుస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు వణుకుతున్నాయని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. అందువల్లే విపక్ష కూటమిపై విషప్రచారం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. బీజేపీ 34 పార్టీలతో ఎన్డీఏ పేరిట కూటమి కట్టగా లేనిది, ప్రతిపక్షాలు 10, 12 పార్టీలతో ఫ్రంట్ కడితే తప్పా అని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏని గద్దె దించేందుకు ప్రత్యామ్నాయ, లౌకిక శక్తులు అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సురవరం జోస్యం చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే సీఎం కేసీఆర్ వంటి వాళ్లు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
‘డిఫెన్స్’ ప్రైవేటీకరణ ప్రమాదకరం...
డిఫెన్స్ పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్టు సురవరం తెలిపారు. ఈ ప్రయత్నాలకు నిరసనగా ఈ నెల 23,24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల్లోని నాలుగున్నర లక్షల కార్మికులు చేపడుతున్న సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించిందన్నారు. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రైవేట్, విదేశీ కంపెనీల జోక్యం పెరగడం ప్రమాదకరమన్నారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ బదిలీ వ్యవహారంలో మోదీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వర్మపై వచ్చిన ఆరోపణలు, సీవీసీ విచారణలో తేలిన అంశాలు, దానిపై జస్టిస్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలను గురించి దేశప్రజలకు తెలియజేసి పారదర్శకతను చాటాలని డిమాండ్ చేశారు. కేరళ పర్యటనకు వెళ్లిన మోదీ కమ్యూనిస్టుపార్టీలపై చేసిన అసంగత, బాధ్యతారహిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
సభ ఔన్నత్యాన్ని పెంచాలి: చాడ
రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ఉధృతం చేశారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇందుకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మెజారిటీ రావడం తో తనకు ఎదురులేదన్న విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన∙సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికార, విపక్షాలను నాణేనికి రెండువైపులా ఉండటాన్ని గమనంలో పెట్టుకుని సభ ఔన్నత్యం పెంచే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment