
జూలకంటి రంగారెడ్డి
హైదరాబాద్: మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి లేఖ ద్వారా కోరారు. ఒక జిల్లాకు కావాల్సిన భౌగోళిక స్వరూపం మిర్యాలగూడకు ఉందని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో అతిపెద్ద యాదాద్రి పవర్ ప్రాజెక్టు దామరచర్లలో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. వందల సంఖ్యలో రైస్‌మిల్లులతో పాటు, సిమెంటు పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నాయని వెల్లడించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు, అతిపెద్ద భారీ ప్రాజెక్టు నాగార్జునసాగర్ కూడా ఈ ప్రాంతంలోనే ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు, ఖాళీ స్థలాలు మిర్యాలగూడ పట్టణంలో అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే సమయంలో మిర్యాలగూడను కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, బంద్‌లు జరిగాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడను వెంటనే జిల్లాగా ప్రకటింపజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన జిల్లాల్లో మిర్యాలగూడ పేరు లేకపోవడంతో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సీఎం సహృదయంతో పరిశీలించి మిర్యాలగూడను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment