హుజూర్‌నగర్ (నల్లగొండ) : రైతు ఆత్మహత్యల నివారణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, రాష్ట్రంలో ఇప్పటికే 900ల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ బాధిత కుటుంబాలను పరామర్శించలేదని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసేలా పాలకులపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 2న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు.