
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధెల్లి బుచ్చిరాములు (83) సోమవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నెలరోజుల కిందట నల్లగొండలోని నవ్య మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. గత ఏడాది డిసెంబర్ 23న ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌తో కోమాలోకి వెళ్లారు. అదే నెల 18న ఆయన భార్య వర్ధెల్లి లక్ష్మమ్మ మృతి చెందారు. ఆమె మృతి చెందిన ఆరురోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనకు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పది రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి నల్లగొండలోని నవ్య ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా ఆయన ఐసీయూలోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బుచ్చిరాములుకు కుమారుడు, సాక్షి దినపత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి, కుమార్తె పద్మలీల ఉన్నారు. మంగళవారం బుచ్చిరాములు అంత్యక్రియలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో..
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో బుచ్చిరాములు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 1975 నుంచి 1989 వరకు సూర్యాపేట తాలుకా కార్యదర్శిగా.. అనంతరం సూర్యాపేట, తుంగతుర్తి రెండు తాలూకాల కార్యదర్శిగా 1996 వరకు సుదీర్ఘకాలం పనిచేశారు. 1994లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తెలంగాణ సా«యుధ పోరాటంలో పాల్గొన్న యోధులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు నిరాకరించిన యోధుడు బుచ్చిరాములు. పార్టీ కూడా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరినప్పటికీ తనకు వద్దని తిరస్కరించారు.
జగన్ సంతాపం
సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములు మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన కుమారుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment