కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం (ఫైల్)
ఆదిలాబాద్‌టౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 వేల మంది వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 8 వేల మంది వరకు సీపీఎస్ పరిధిలోకి వస్తున్నారు. శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయుల సామూహిక సెలవుతో పాఠశాలల్లో బోధన, ప్రభుత్వ కార్యాయాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. కలెక్టరేట్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కొన్నేళ్లుగా ఉద్యమం..
సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వారి భద్రతకు విఘాతంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన బాట పట్టారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదు. వీరికి ఉద్యోగ జేఏసీ, ఉపాధ్యాయ జాక్టో, టీటీజేఏసీ వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
2004 నుంచి సీపీఎస్ అమలులోకి..
2004 నవంబర్ 1 నుంచి సీపీఎస్ విధానం అమలులోకి వచ్చింది. 2004 సంవత్సరం తర్వాత నియామకం అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తించదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. సీపీఎస్ ఉద్యోగి సర్వీస్‌లో చేరగానే ఒక పర్మినెంట్ అకౌంట్ నంబర్ కేటాయిస్తారు. ఉద్యోగి జీతం నుంచి నెలనెల 10 శాతం కోత విధించి అంతే మొత్తాన్ని ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా సమకూర్చి ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది.
ఇలా జమ అయిన మొత్తం సొమ్ములో 60 శాతం ఉద్యోగ విరమణ తర్వాత చెల్లిస్తారు. మిగతా 40 శాతం ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల్లో మ్యాచువల్ ఫండ్‌లలో జమచేసి వాటిపై వచ్చే వడ్డీ పెన్షన్ రూపంలో ఉద్యోగికి 71 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత 40 శాతం డబ్బును ఉద్యోగికి అందజేసి పెన్షన్ నిలిపివేస్తారు. 70 ఏళ్లలోపు మృతిచెందితే అతడిపై ఆధారపడిన భార్యకు ఎలాంటి పెన్షన్ ఇవ్వరు. షేర్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడుల లాభనష్టాలకు అనుగుణంగా ఉద్యోగి విరమణ అనంతరం వాటిని పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. ఉద్యోగ విరమణ తర్వాత భరోసా లేని సీపీఎస్ విధానం రద్దు చేయాలని పేర్కొంటున్నారు.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఉద్యోగ విరమణ తర్వాత అరకొర పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. గ్రాట్యూటీగా ఇచ్చే మొత్తం డబ్బులు ఇవ్వకుండా 40 శాతం ఆపుకోవడం సరికాదు. అసంబద్ధంగా ఉన్న సీపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలి. – నల్ల రత్నాకర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
రద్దు చేయాలి
సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసిన వారికి పెన్షన్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నాం.
– దాముక కములాకర్, సీపీఎస్‌టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment