
సాక్షి, హైదరాబాద్: వి–హబ్ ఆధ్వర్యంలో పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణ పత్రాలను ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అందించారు. శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానంతరం బ్యాంకు అధికారులు, వి–హబ్ ప్రతినిధుల సమక్షంలో రుణాల అందజేత కార్యక్రమం జరిగింది. తమ వ్యాపారాల కోసం అవసరమైన నిధుల సమీకరణకు వి–హబ్ మహిళా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను కోరగా, 245 మంది మహిళా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు అందాయి.
అందులో సుమారు 16 స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసుకుని వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకుల నుంచి వి–హబ్ రుణ సౌకర్యాన్ని కల్పించింది. ముద్ర లోన్లు, స్టాండప్ ఇండియా వంటి పథకాల్లో భాగంగా ఈ లబ్ధిదారులకు రుణాలు లభించాయి. ఆర్థిక సహకారం అందించడానికి చేపట్టిన ఈ కార్యక్రమంపై కేటీఆర్ వి–హబ్ బృందానికి అభినందనలు తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు వి–హబ్ సీఈవో దీప్తి రావు పలువురు బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment