ప్చ్.. ఇది నష్టం కాదట..!
ఎద్దు నొప్పి కాకికేం తెలుసన్న చందంగా ఉంది మార్కెట్ అధికారుల తీరు. అకాల వర్షానికి అన్నదాతలు రెండు రకాలుగా నష్టపోయారు. అధికులు పొలంలోనే వరి, తదితర పంటలు నేలకొరిగి తడిసి పాడయ్యాయి. ఇక బాదేపల్లి, జిల్లా కేంద్రంలోని మార్కెట్లకు రైతులు అమ్మకానికి తెచ్చిన వరి, మిరప పంటలు సరైన వసతి సౌకర్యం లేక తడిసి పోయాయి. దీన్ని కొనుగోలు చేయలేమని మార్కెట్ వర్గాలు మొహం మీదే చెప్తుతుండడంతో కర్షకులు కంగుతింటున్నారు. ఇక కొంత మంది వ్యాపారులూ తాము కొనుగోలు చేసిన సరకు దెబ్బతిందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీటిన్నిటినీ అధికారులు అబ్బే అలాంటిదేమీ లేదని ఏకవాక్య తీర్మానంతో కొట్టిపారేస్తుండడం రైతులను కలవరపరుస్తోంది.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో పంట నష్టం జరగలేదట.... వ్యవసాయ మార్కెట్లలో రైతులకు సంబంధించిన ధాన్యం తడవలేద ట.. ఇది అంటున్నది ఎవరో కాదు సాక్షాత్తూ శాఖలను పర్యవేక్షిస్తున్న అధికారుల మాటలు. గురు,శుక్ర వారాల్లో జిల్లాలో భారీగా వర్షం పడిందే తప్పితే... ఎలాంటి పంట నష్టం వాటిల్లలేదని తేల్చి చెబుతున్న తీరు అధికారుల నిర్వాకానికి, నిర్లక్ష్యానికి నిలువుటద్దమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలనలు, సర్వేలు చేపట్టకుండానే పంట నష్టంపై అధికారగణం ఈ నిర్థారణకు రావటంపై రైతులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. మండల స్థాయిల్లో వ్యవసాయాధికారులను, మార్కెట్ల స్థాయిలో యార్డు కార్యదర్శులతో పూర్తి స్థాయిలో చర్చించిన మీదటనే నష్టం జరగలేదన్న నిర్ణయానికి వచ్చినట్టుగా వారు చెబుతున్న తీరు రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.మార్కెట్ యార్డుల్లో ఏమైనా ధాన్యం తడిసినట్టు రైతులు తమకు ఫిర్యాదు వస్తే అప్పటి పరిస్థితులను బటి ్ట తగిన పరిశీలనల తో చర్యలు చేపట్టగలమని మాత్రం మా ర్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వైపున ఉన్నతాధికారులు, ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ స్వయంగా పంట నష్టంపై అంచనాలు రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఇక్కడి అధికారులు బేఖాతర్ చేస్తున్న వైనంపై రైతులు అగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.
గగ్గోలు పెడుతున్నారు...
ఇదిలా...ఉండగా రైతులు మాత్రం నష్టపోయిన పంటలు, తడిసిన ధాన్యంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సం ఘాల ప్రతినిధులు సైతం అధికారుల నిర్వాకంపై మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టంపై సర్వేలు, పరిశీ లనలు చేపట్టకుండా తప్పుదారి విధానాలు, చర్యలతో రైతుకు నష్టం కలిగించే పద్దతు అవలంభించటం సరికాదంటున్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లాలో భారీగా కురిసిన అకాల వర్షం కారణంగా 2,340 ఎకరాల్లో వరి పంట, 200ల ఎకరాల్లో టమాట తోటలు, 60 ఎకరాల్లో వేరుశెనగ పంట, 300ల ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వివరిస్తున్నారు.
అదేవిధం గా షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు తరలించిన మూడు వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దైందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లో 50 క్వింటాళ్ల మిర్చి, వందలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయినట్లు పేర్కొంటున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా వరి పంట పూర్తిగా నేలపై పడిపోయి గింజలు రాలిపోయినట్లు రైతులు వివరిస్తున్నారు. ఇలాం టి క్లిష్ట పరిస్థితుల్లో పంటలు దెబ్బతిని ఆవేదన చెందుతున్న రైతులను ఆదుకోవాల్సిన వ్యవసాయశాఖ పంటనష్టం జరుగలేదని తప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో తడిసిపోయిన ధాన్యం వ్యాపారులవేనని మార్కెటింగ్ శాఖాధికారులు పేర్కొంటున్న తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకం కోసం పండించిన ధాన్యం మార్కెట్లకు తరలించి రోజుల తరబడి నిరీక్షిస్తున్న తీరును రైతులు ఎండ గడుతున్నారు.