రూ.11,960 కోట్లు.. ఆగిపోయాయ్!
- విడుదల కాని కేంద్ర నిధులు
- మరో 3 నెలలే గడువు
- తెచ్చుకోకపోతే మురిగిపోయే ప్రమాదం
- అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధుల మాట పక్కన పెడితే... ప్రణాళిక నిధులకు సైతం ఎసరొచ్చేలా ఉంది. కొత్త రాష్ట్రం కావటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయానికి ఎదురు చూస్తున్న తెలంగాణకు అపార నష్టం ముంచుకొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తెలంగాణకు కేటాయించిన ప్రణాళిక నిధులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వివిధ విభాగాల పరిధిలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు కేటాయించిన రూ.11,960 కోట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ నిధులను తెచ్చుకోకుంటే అవన్నీ మురిగిపోనున్నాయి.
ఆర్థిక శాఖ అప్రమత్తం..
ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. విభాగాల వారీగా కేంద్రం కేటాయింపులు.. ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. వాటి ఖర్చుల వివరాలతో నివేదిక సిద్ధం చేసింది. మార్చిలోగా ఈ నిధులు విడుదల చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులను నిర్దేశించింది. విభాగాల వారీగా ఆయా శాఖల మంత్రులకు కేంద్రంపై ఒత్తిడి పెంచే బాధ్యతను అప్పగించింది. వారం రోజుల్లో అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎవరికి వారు తమ శాఖకు సంబంధించి నిలిచిపోయిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సూచించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఇటీవల జరిగిన భేటీలోనూ తాను ఈ నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధుల వినియోగపు పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పించలేదనే కారణంతో కొన్ని విభాగాలు నిధుల విడుదలకు కొర్రీలు పెడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో యూసీలను వెంటనే సమర్పించటంతోపాటు ఆర్థిక సంవత్సరపు గడువు ముగిసేలోగా మిగిలిన నిధులు రాబట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.
- సాక్షి, హైదరాబాద్
వచ్చింది 17 శాతమే..
2014-15 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక పద్దులో తెలంగాణ రాష్ట్రానికి రూ. 14,443 కోట్ల కేటాయింపులు చేసింది. అందులో ఇప్పటి వరకు కేవలం రూ. 2,483 కోట్లు విడుదల చేసింది. కేవలం 17 శాతం నిధులు విడుదలైన తీరు చూస్తే.. కేటాయింపులు కొండంత.. ఇచ్చింది గోరంత.. అన్నట్లుగానే ఉంది. మిగతా 83 శాతం నిధులు కేంద్రం ఖజానాలోనే ఆగిపోయాయి.