
సాక్షి, మిర్యాలగూడ : ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం నందిపాడుకు చెందిన కొప్పోజు వెంకటేశ్వర్లు, సైదమ్మల రెండో కుమారుడు ధర్మేంద్రచారి 13ఏళ్ల క్రితం సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికై జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా తోటి జవాన్‌లతో కలిసి శుక్రవారం రాత్రి రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెం దినట్లు కుటుంబ సభ్యులకు సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఫోన్ ద్వార సమాచారం అందించారు.
కాగా నందిపాడుకు చెందిన ధర్మేంద్రచారి నకిరేకల్ పట్టణానికి చెందిన నిర్మలాదేవితో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూ తురు హర్షిత, కుమారుడు శ్రీకాంతాచారి ఉన్నారు. ధర్మేంద్రచారి నెలరోజుల క్రితం నందిపాడుకు వచ్చాడు. 20రోజుల క్రితం తిరగి జార్ఖండ్‌కు వెళ్లి విధుల్లో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా వెలుతున్న క్రమంలో ధర్మేంద్రచారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు.
శోకసంద్రంలో నందిపాడు..
నిత్యం అందరితో కలిసిమెలసి ఉంటూ ఆప్యాయతగా పలుకరించే ధర్మేంద్రచారి విధినిర్వహణలో ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి చనిపోవడంతో నందిపాడు శోక సంద్రంలో మునిగిపోయింది. విధి నిర్వహణలో పట్టుదలతో ఉండే ధర్మేంద్రచారి అకాల మరణం నందిపాడును కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్రచారి బంధువుల, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలి వచ్చారు.
పట్టణంలో ర్యాలీ..
విధి నిర్వహణలో మృతిచెందిన జవాన్ ధర్మేంద్రచారి పార్థీవదేహం వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు, కార్పెంటర్లు, పోలీసులు, పట్టణ వాసులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్మేంద్రచారి జోహార్లు అంటూ నినాదాలతో సాగర్‌రోడ్డు మీదుగా పార్థీవదేహం నందిపాడుకు చేరుకుంది.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..
జవాన్ ధర్మేంద్రచారి మృతదేహన్ని శనివారం రాత్రి మిర్యాలగూడకు తీసుకొచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment