జగదేవ్‌పూర్: ఈ ఖరీఫ్‌లోనే సీఎం దత్తత గ్రామాల్లో విత్తనోత్పత్తి చేపడుతామని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు, జేసీ వెంకట్రాంరెడ్డి తెలిపారు. శనివారం సీఎం దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో వీడీసీ, రైతులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో మొత్తం 28 వేల ఎకరాల్లో సోయాబీన్, మొక్కజొన్న సాగు చేస్తామని తెలిపారు.
నల్లరెగడి భూముల్లో సోయాబీన్, ఎర్ర నెలల్లో మొక్కజోన్న పంటలను సాగు చేయనున్నట్లు తెలిపారు. రెండు గ్రామాల రైతులు విత్తనోత్పత్తికి సహకరించాలని కోరారు. ఎర్రవల్లి నుండే రాష్ట్రానికి విత్తనాలు సరఫరా అయ్యేలా రెండు గ్రామాల్లో విత్తనోత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. రబీలో వేరుశనగ, మినుములు, పెసరు పంటలను విత్తనోత్పత్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్ పంటకు డ్రిప్పు కొంత అలస్యం అయినా రబీలో మాత్రం డ్రిప్పు ద్వారానే పంటలు సాగు చేస్తామని చెప్పారు. మొత్తం 42 ట్రాక్టర్లను, 24 టన్నుల విత్తనాలను రైతులకు అందిస్తామన్నారు.