పగలైనా.. రాత్రయినా.. పడిగాపులే! | Currecy effect | Sakshi
Sakshi News home page

పగలైనా.. రాత్రయినా.. పడిగాపులే!

Published Sun, Dec 4 2016 4:22 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

పగలైనా.. రాత్రయినా.. పడిగాపులే! - Sakshi

పగలైనా.. రాత్రయినా.. పడిగాపులే!

ఎక్కడికెళ్లినా నో క్యాష్ బోర్డులే
 నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల రాస్తారోకో

 తిప్పర్తి: పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత తీవ్రంగా ఉండటంతో నల్లగొండ జిల్లాలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో నోక్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి.  తిప్పర్తి ఏపీజీవీబీ బ్యాంకులో వారం రోజులుగా డబ్బుల కొరత పీడిస్తోంది. ఒక్కో ఖాతాదారుడికి రూ.1,000 చొప్పున మాత్రమే అందజేస్తున్నారు. ఈ మధ్యనే ధాన్యం అమ్ముకున్న రైతులు రోజూ బ్యాంకు  చుట్టూ తిరుగుతున్నారు. సరిపడా కొత్త నోట్లు రాలేదని బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఆగ్రహానికి లోనైన రైతులు, ప్రజలు శనివారం నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు.  

 పెళ్లికి పైసలివ్వండి సారూ
 మెదక్ మున్సిపాలిటీ: ‘మా నాన్న మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నారు. నా పెళ్లి కోసం బ్యాంకులో లోన్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం. అయితే పోరుున నెల 9నుంచి పెద్దనోట్లు రద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రూ.4.80 లక్షలు   (రూ.1000, 500నోట్లు) పట్టణంలో గల ఎస్‌బీహెచ్ బ్యాంకులోని మా నాన్న ఖాతాలో జమ చేశాం. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం కుదిరింది. ఇంట్లో చిల్లిగవ్వలేదు. అబ్బారుు వాళ్లు పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి ఎల్లుండి వస్తామని చెప్పారు. ఇప్పుడేం చేయాలో మాకు అర్థం కావడం లేదు. దీంతో మా డబ్బులను ఇవ్వాలని ఇన్‌చార్జి కలెక్టర్ సురేష్‌బాబును శనివారం కలసి మొర పెట్టుకున్నారు మెదక్ పట్టణం గోల్కొండ వీధికి చెందిన మున్సిపల్ కార్మికుడు బంజపల్లి పెంటయ్య కూతురు బాలమణి.  వారంలో ఒకసారి రూ.24 వేలు మాత్రమే ఇస్తామంటున్నారని, మొత్తం డబ్బు వచ్చేలా ఏర్పాటు చేయాలని  వేడుకున్నారు.  
 
 ‘చెప్పు’కో వంతు!  
 బచ్చన్నపేట: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో.. అటు ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇటు ధాన్యం అమ్ముకున్న రైతులు బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఓపిక లేక కొందరు తమ పాదరక్షలను నంబర్ కోసం క్యూలో పెట్టుకుంటున్నారు. ఇలాంటి దృశ్యమే బచ్చన్నపేటలోని సెంట్రల్ బ్యాంకు ఎదుట శనివారం కనిపించింది.   
 
 వైద్యం అందక చిన్నారి మృతి
 మణుగూరు రూరల్: బ్యాంకుల్లో నోట్లు చేతికి రాక.. సకాలంలో వైద్యం అందక ఓ చిన్నారి ప్రాణాలు విడిచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమితిసింగారానికి చెందిన నాగెల్లి నిర్మల, సైదులు దంపతుల కుమారుడు విజయ్(2) శుక్రవారం తండ్రితో కలిసి ట్రాలీ ఆటో లో వెళ్తుండగా.. అది బోల్తాపడింది. దీంతో విజయ్ తలకు తీవ్ర గాయాలయ్యారుు. తొలుత భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ఆపరేషన్ చేయాలని, దానికి రూ.50వేలు కట్టాలని వైద్యులు చెప్పా రు. తెలిసినవారిని అడిగినా రెండు మూడు వేల రూపాయలు కూడా సమకూరలేదు. డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పడంతో సకాలంలో బ్యాంకు నుంచి డబ్బులు రాక తన మనవడు మృతిచెందినట్లు ఏసోబు(జగ్గన్న) విలపిస్తూ చెప్పాడు. ఆపదలో కూడా బ్యాంకు వారు డబ్బులిచ్చేందుకు నిబంధనలు పెట్టడంవల్లే విజయ్ మృతి చెందాడని, దీనికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
 
 చాయ్‌కి చిల్లర లేక చెక్కు!  
 పెద్దపల్లి: పెద్దనోట్ల రదుతో చిల్లర వ్యాపారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని కమాన్ వద్ద దాస్ హోటల్‌లో స్నేహితులతో కలిసి చాయ్ తాగిన కొందరు యువకులు తమ వద్ద చిల్లర లేక పోవడంతో యజమాని దాస్‌కు రూ.35 చెక్కు రూపంలో ఇచ్చారు. రూ.2వేల నోటు ఇస్తే చిల్లర లేదనడంతో చెక్కు ఇచ్చినట్లు కొండి సతీష్, బండారి సునిల్, పడాల సతీష్, గుండ అరుణ్ వెంకటేశ్, శ్రీనివాస్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement