బ్యాంకు ఖాతాదారులను మళ్లీ కరెన్సీ కష్టాలు పలకరిస్తున్నాయి. ఏ బ్యాంకుకు వెళ్లినా, ఏటీఎం సెంటర్‌కు పోయినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పాత నోట్లు రద్దు చేసిన నాటి నుంచి ప్రారంభమైన నోట్ల ఇబ్బందులు ఇప్పటికి కూడా తొలగలేదు. రోజురోజుకు కొత్త నిబంధనలు రావడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారు తగ్గిపోతున్నారు. మూడు పర్యాయాల కంటే ఎక్కువ సార్లు డిపాజిట్ చేసినా, డ్రా చేసినా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో లావీదేవాలు నిర్వహించే వారు తగ్గిపోతున్నారు. ఉదయం ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తే సాయంత్రం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడం గమనార్హం.
మిర్యాలగూడ :
జిల్లా వ్యాప్తంగా డబ్బులు లేక బ్యాంకులన్నీ బోసిపోతున్నాయి. ఖాతాదారులు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో అన్ని రకాల బ్యాంకులు 270 ఉండగా 1500 ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. అయినా పది శాతం ఏటీఎంలల్లోనే డబ్బులు ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా డబ్బుల కోసం ఖాతాదారులు ఇక్కట్లు పడుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు సైతం కష్టాలు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు నెలవారి వేతనాలు బ్యాం కు ద్వారా వచ్చే అవకాశం ఉంది. దీంతో వేతనాల డబ్బు ల కోసం ఏటీఎంలు, బ్యాం కుల చుట్టూ తిరగనున్నారు.
క్యాష్‌లెస్ వైపు మళ్లించడానికే..
ఏ వస్తువు కొనుగోలు చేసినా క్యాష్‌లెస్‌తో డబ్బు చెల్లింపుల వైపు మళ్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాబోయే రోజుల్లో డబ్బుల మార్పిడి తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకు గాను ప్రభుత్వమే తక్కువ డబ్బులు విడుదల చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపుల కారణంగా బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేకున్నా ఖాతాదారుల ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. క్యాష్‌లెస్ సేవలపై అవగాహన కల్పించడానికి గాను జూన్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని బ్యాంకుల అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడానికి ‘క్యాష్‌లెస్ లిటరసీ వీక్’ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించడం విశేషం.
ఏటీఎంలో డబ్బులు లేవు
ప్రస్తుతం నేను గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. అందులో భాగంగా కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం మూడు రోజుల నుంచి ఏటీఎం సెంటర్ వద్దకు వస్తున్నా. కానీ ఎక్కడ కూడా డబ్బులు లేవు. సమయానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
– భీమ్‌సింగ్, విద్యార్థి, మిర్యాలగూడ
నో..క్యాష్!
Published Thu, Jun 1 2017 12:54 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
Advertisement
Advertisement