‘కస్టం’మిల్లింగ్ | 'Custom' milling | Sakshi
Sakshi News home page

‘కస్టం’మిల్లింగ్

Published Wed, Aug 5 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

'Custom' milling

మిర్యాలగూడ : ప్రభుత్వ బియ్యంతో వ్యాపారం చేసుకోవడం మిల్లర్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. రైతులనుంచి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కస్టం మిల్లింగ్ పేరుతో మిల్లర్ల పాలవుతోంది.  గడువుల మీద గడువులు విధిస్తూ మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడం, చివరికి కేసులు నమోదు చేయడం ప్రతి ఏటా సాగుతున్న తంతు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు కనీసం 50 శాతం బియ్యం కూడా మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయలేదు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం తో మిల్లర్లు దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు.  ఈ ఏడాది రబీ సీజన్‌లో ప్రభుత్వం ఐకేపీ, సివిల్ సప్లయీస్, పీఏసీఎస్ కేం ద్రాల ద్వారా 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 220 రైస్‌మిల్లులకు ధాన్యం ఇచ్చారు. మిల్లర్ల నుంచి 2.84 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. కాగా మిగతా బియ్యాన్ని సెప్టెంబర్‌లోగా మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.
 
 గత ఏడాది రెండు మిల్లులపై కేసులు
 గత ఏడాది కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి సంబంధించి 5,800 మెట్రిక్ టన్నులు పది రైస్‌మిల్లుల నుంచి రావాల్సి ఉంది. దీంతో రెండు రైస్‌మిల్లుల్లో బియ్యం లేకపోవడంతో సివిల్‌సప్లయీస్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది కస్టమ్ మిల్లింగ్ బియ్యం గడువులోగా సేకరించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.
 
 గోదాముల కొరత
 మిల్లర్ల నుంచి ప్రభుత్వం తీసుకునే కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి గోదాముల కొరత ఏర్పడింది. జిల్లాలోని బీబీనగర్‌లోని ప్రైవేటు గోదాములు, చిలుకమర్రి, మిర్యాలగూడలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు లీజుకు తీసుకోవాలని ఇటీవల జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. దీంతో మిల్లర్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో సేకరించాలని అధికార యంత్రాంగం కసరత్తు నిర్వహిస్తోంది.
 
 బియ్యం సేకరణపై దృష్టి
 కస్టమ్ మిల్లింగ్‌పై దృష్టి సారించాం. ప్రతిఏటా కూడా మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో చివరికి కొన్ని రైస్ మిల్లులకు గడువు కూడా పెట్టాం. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించడానికి చర్యలు చేపట్టాం.
 - వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ, నల్లగొండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement