జాగ్రత్తలను వివరిస్తున్న కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కళ్యాణ్ రేవెళ్ల
సాక్షి, సిటీబ్యూరో: కస్టమ్స్ నిబంధనలపై సరైన అవగాహన లేని కారణంగా నిత్యం అనేక మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు వెళ్లేటప్పుడో, తిరిగి వచ్చేటప్పుడో సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కస్టమ్స్ అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కళ్యాణ్ రేవెళ్ల శుక్రవారం వివరించారు.
æ రోజువారీ వినియోగించుకునే వస్తువులు (జ్యువెలరీ మినహా), రెండు లీటర్ల వరకు మద్యం, 100 సిగరెట్లు, ఓ ల్యాప్‌టాప్... ఎలాంటి పన్ను లేకుండా తెచ్చుకోవచ్చు. వాడుకుంటున్న సెల్‌ఫోన్ కాకుంటే మరొకటి తీసుకురావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. రూ.50 వేల లోపు విలువైన ఒకటి తీసుకురావచ్చు. రేటు, సంఖ్య పెరిగితే 38.5 శాతం పన్ను విధిస్తారు.
ఎక్స్‌పోర్ట్ సర్టిఫికెట్...
ఏవైనా విలువైన వస్తువులను విదేశాలకు తీసుకువెళ్తూ ఉంటే తిరిగి వాటిని భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంటే వాటికి సంబంధించి ఎక్స్‌పోర్ట్ సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్ హాళ్లలోని కౌంటర్లలో వాటిని చూపించి ఈ సర్టిఫికెట్లు పొందవచ్చు. తద్వారా తిరిగి వచ్చేప్పుడు ఆయా వస్తువులపై సుంకం చెల్లించాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిషిద్ధ వస్తువులు...
మాదకద్రవ్యాలు, నకిలీ, అటవీ ఉత్పత్తులు, అశ్లీల సాహిత్యము తదితరాలు, జంతువులు (చిన్న, పెద్ద) విమానాల్లో తీసుకువెళ్లడంపై నిషేధం ఉంది. వీటిని గుర్తిస్తే స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మారణాయుధాలు, నిర్దిష్ట ఫ్రీక్వెన్సీకి మించిన సమాచార సాధనాలు, కొన్ని రకాల మొక్కలు, వాటి ఉత్పత్తులు, మందులతో పాటు తీసుకువెళ్లేందుకు అనుమతించిన వస్తువులు సైతం వ్యక్తిగత అవసరాలకు మించి వాణిజ్య స్థాయిలో తీసుకువెళ్లకూడదు.
పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కస్టమ్స్ అధికారులు ‘ఇండియన్ కస్టమ్స్ ట్రావెల్స్ గైడ్’ పేరుతో యాప్ నిర్వహిస్తున్నారు. దీన్ని ప్లేస్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment