రైతు రుణ మాఫీకి మూడు కటాఫ్ తేదీలు.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్థికశాఖ వర్గాలు
అన్నింట్లోనూ ఏడాది కాలపరిమితితోనే తెలంగాణ సర్కారుకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీపై రాష్ర్ట ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో పరిమితుల విధింపు ప్రకటనలు వివాదాస్పదమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై రైతాంగంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందిస్తున్న నివేదికలు మళ్లీ సందేహాలకు తావిస్తున్నాయి. బ్యాంకర్లు అందించిన సమాచారం ఆధారంగా మూడు అప్షన్లతో కూడిన కటాఫ్ తేదీలతో ఆర్థిక శాఖ వర్గాలు తాజాగా నివేదిక రూపొందించాయి. దీన్ని బట్టి చూస్తే ఎటుతిరిగి ఏడాది కాలపరిమితి విధిస్తూ.. ఆలోగా తీసుకున్న బంగారం రుణాల మాఫీకే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం.
అందులోనే 2013-14లో నవీకరించుకున్న రుణాలు, పాత బకాయిలు కూడా కలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒక కటాఫ్‌ను ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉంది. రైతులు తీసుకున్న పంట రుణాలతోపాటు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే అధికారులు కూడా జాబితా సిద్ధం చేశారు. పంట రుణాలు, బంగారం తాకట్టు రుణాలు, లక్ష రూపాయల్లోపు పాత రుణాలు, అంతకు మించిన రుణాలవారీగా వివరాలను క్రోఢీకరించి నివేదిక రూపొందించారు. వడ్డీతో కలిపి లక్ష వరకు రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తామని.. అంతకుమించి రుణమొత్తం ఉంటే రూ. లక్షపోగా మిగిలినది మొత్తాన్ని సంబంధిత రైతులే చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, తాజాగా అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2014 మార్చి 31 వరకు రూ. 17,756.88 కోట్ల పంట రుణాలు ఉన్నాయి.
ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 15,809.61 కోట్ల రుణాల మాఫీకి అర్హత ఉందని పేర్కొన్నారు. ఇక 2013 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలు రూ.18,509.48 కోట్లుగా తేలింది. ఇందులో మాఫీకి అర్హమైన రుణాలు రూ.16,417.19 కోట్లుగా అధికారులు తేల్చారు. అలాగే గతేడాది జూన్ ఒకటి నుంచి ఈ సంవత్సరం మే 31 వరకు చూసుకుంటే మొత్తం బకాయిలు రూ.17,783 కోట్లు కాగా.. రూ. 15,628.31 కోట్లు మాఫీ చేయడానికి అర్హమైనవిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.