♦ ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి జోన్
♦ భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లతో ఏర్పాటు
♦ అల్వాల్ డివిజన్ స్థానంలో కుషాయి గూడ
♦ వెస్ట్‌లో కొత్తగా షాద్‌నగర్ , మియాపూర్ డివిజన్లు
♦ సిటీ కమిషనరేట్‌లోకి సనత్‌నగర్ పోలీసుస్టేషన్
♦ ముఖ్యమంత్రి వద్దకు చేరిన విభజన దస్త్రం
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను విభజన ప్రక్రియలో రోజురోజుకూ మార్పులు.. చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎల్‌బీనగర్ జోన్, మల్కాజిగిరి జోన్లతో ఈస్ట్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలతో పాటు కొత్తగా కలుస్తున్న ప్రాంతాలతో భువనగిరి జోన్‌ను కూడా ఏర్పా టు అంశం తెరపైకి వచ్చింది. ఈ జోన్‌లో చౌటుప్పల్ డివిజన్ కూడా ఉండేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం మల్కాజిగిరి జోన్ పరిధిలో ఉన్న కీసర, ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్లను భువనగిరి జోన్‌లో కలపాలని పోలీసు రీ - ఆర్గనైజేషన్ వింగ్ ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొన్నారు.
వీటితో పాటు భువనగిరి టౌన్ అండ్ రూరల్, బొమ్మలరామారం, బీబీ నగర్ ఠాణాలు భువనగిరి జోన్ పరిధిలోకి తెస్తున్నారు. అలాగే ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉన్న హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌ను చౌటుప్పల్ డివిజన్‌లో కలుపుతూ భువనగిరి జోన్‌లోకి తీసుకురానున్నారు. చౌటుప్పల్ డివిజన్‌లో చౌటుప్పల్, బొలిగొండ, పోచారం ఠాణాలు ఉండనున్నాయి. అయితే ప్రస్తుతం శంషాబాద్ జోన్ పరిధిలో ఉన్న పహడీషరీఫ్ పోలీసు స్టేష న్‌ను ఎల్‌బీనగర్ జోన్ పరిధిలో గల హయత్‌నగర్ ఠాణా స్థానంలో వచ్చి చేరనుంది. మీర్‌పేట, వనస్థలిపురంతో పాటు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లు వనస్థలిపురం డివిజన్ పరిధిలో ఉంటాయి. మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా మార్చాలని ప్రతిపాదించా రు.
కొత్తగా మియాపూర్ డివిజన్..
మాదాపూర్ జోన్‌లో ప్రస్తుతమున్న మాదాపూర్, కూకట్‌పల్లి డివిజన్లకు తోడుగా కొత్తగా మియాపూర్ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మాదాపూర్ డివిజన్‌లోని చందానగర్ ఠాణా తో పాటు కూకట్‌పల్లి డివిజన్‌లోని మియాపూర్ పోలీసు స్టేషన్‌ను, మెదక్ జిల్లాకు చెందిన ఆర్‌సీ పురం ఠాణాలతో ఈ మియాపూర్ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పంపారు. అయితే మాదాపూర్ డివి జన్, కూకట్‌పల్లి డివిజన్‌లోని మిగతా ఠాణాలన్నీ యథావిధిగానే ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్‌లోని అల్వాల్ పీఎస్‌ను బాలానగర్ డివిజన్‌లోకి చేర్చాలని నిర్ణయించారు.
శంషాబాద్ జోన్‌లోకి షాద్‌నగర్ డివిజన్..
వెస్ట్ కమిషనరేట్‌లో శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, మల్కాజిగిరి జోన్‌లు ఉండనున్నాయి. అయితే శంషాబాద్ జోన్‌లోకి కొత్తగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన షాద్‌నగర్ డివిజన్ వచ్చి చేరనుంది. షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు ఠాణాలు ఈ డివిజన్ పరిధిలో ఉంటాయి. శంషాబాద్ డివిజన్‌లో ప్రస్తుతమున్న శంషాబాద్, ఆర్‌జీఐ పోలీసు స్టేషన్‌లతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవెళ్ల, షాబాద్ ఠాణాలు వచ్చి చేరుతున్నాయి. ఈ జోన్‌లోని రాజేంద్రనగర్ డివిజన్‌లోకి రంగారెడ్డి జిల్లాలో ఉన్న శంకర్‌పల్లి ఠాణా కలుపుతున్నారు. మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, మొయినాబాద్ ఠాణాలు యథావిధిగానే ఉంచుతూ ఈ డివిజన్ పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్‌ను మాత్రం మాదాపూర్ డివిజన్‌లో చేరుస్తున్నారు.
సైబరాబాద్ విభజన స్వరూపమిది..
ఈస్ట్ కమిషనరేట్..
భువనగిరి జోన్ : భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు
మల్కాజిగిరి జోన్ : మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు
ఎల్‌బీనగర్ జోన్ : ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు
వెస్ట్ కమిషనరేట్...
శంషాబాద్ జోన్ : శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్‌నగర్ డివిజన్లు
మాదాపూర్ జోన్ : మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్ డివిజన్లు
బాలానగర్ జోన్ : పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు
(జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు)
సిటీ కమిషనరేట్‌లోకి సనత్‌నగర్ ఠాణా...
సైబరాబాద్ విభజన ప్రభావం హైదరాబాద్ మీద పడుతోంది. ప్రస్తుతం బాలానగర్ జోన్ పరిధిలో ఉన్న సనత్ నగర్ పోలీసు స్టేషన్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ కిందకు వచ్చి పంజ గుట్ట డివిజన్‌లో కలపాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దాదాపు నగరం మధ్యలోనే ఉండడం, సిటీకి అనుకొని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సమగ్ర ప్రతిపాదనలతో కూడిన ఫైల్‌ను రీ - ఆర్గనైజేషన్ వింగ్ సీఎం కేసీఆర్‌కు పంపింది. ఆయన తీసుకునే నిర్ణయం ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పుల తర్వాత అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
సిబ్బందిలో గందరగోళం..
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విభజనలో భాగంగా నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోని కొన్ని ఠాణాలను కలపాలన్న నిర్ణయం ఉద్యోగుల్లో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్నా ఈ రెండు విభాగాలకు చెందిన సిబ్బంది సీనియారిటీ విషయంలో ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెడ్ కానిస్టేబుల్ పదోన్నతుల విషయంలో ఇప్పటికే పలువురు కోర్టుకు వెళ్లారు.
ఈ విషయం కోర్టులో నడుస్తుండగానే మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాలోని కొన్ని పోలీసుస్టేషన్ల సిబ్బందిని ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్‌లోకి తీసుకురావాలని రీ ఆర్గనైజేషన్ వింగ్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన పోలీసు ఉద్యోగుల్లో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు సైబరాబాద్ ప్రత్యేక యూనిట్ కావడంతో అక్కడ పని చేస్తున్న వారు తమ సీనియారిటీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.