
సిలిండర్ పేలడంతో దగ్ధమైన పానీపూరి బండి
సాక్షి, కడ్తాల్(కల్వకుర్తి): పానీపూరి బండిలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ఫ గాయాలయ్యాయి. ఈ ఘటన కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం–హైద్రాబాద్ జాతీయ రహదారిపై మండల కేంద్రంలోని బస్‌స్టాప్ పక్కన, మార్వాడీ కమలేష్ అనే వ్యక్తి కొంత కాలంగా పానీపూరి తోపుడుబండిని ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం పానిపూరిలు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై క్షణాల్లో ఆ బండి మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన సమీపంలోని చిరువ్యాపారులు పరుగులు పెట్టారు. గమనించిన స్థానికులు కొంత మంది సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి నీళ్లు తీసుకువచ్చి వేంటనే మంటలపై నీళ్లు చల్లుతూ, బండి క్రింద ఉన్న సిలిండర్‌ను తొలగించారు. ఈ సంఘటనలో పానీపూరి బండి యాజమాని కమలేష్‌తో పాటు, అతని కుమారుడికి స్వల్ఫంగా గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు, సమీపంలోని చిరువ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment