
చెక్ కాలనీవాసులతో మిలన్ హోవర్కా
హైదరాబాద్: తమ దేశం పేరిట హైదరాబాద్‌లో ఒక కాలనీ ఉందని తెలిసి రెక్కలు కట్టుకుని వాలిపోయారాయన. ఒకనాడు తమ దేశ ఇంజనీర్లు గడిపిన ప్రాంతాలను చూసి మైమరచిపోయారు. తమ దేశస్తులు నడిచిన గడ్డకు సలాం కొట్టారు. ‘ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్’ అంటూ అక్కడి వారిని గుండెలకు హత్తుకుని ఉద్వేగానికి గురయ్యారు. ఆ కాలనీవాసులు సైతం తమ ఆత్మ బంధువే ఇంటికొచ్చినట్టు ఆత్మీయ ఆతిథ్యంతో అక్కున చేర్చుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు..? ఏ దేశానికి చెందినవారు..? ఆ కాలనీ ఎక్కడ ఉంది..?
ఆయన పేరు మిలన్ హోవర్కా.. భారత్‌లో చెక్ రిపబ్లిక్ రాయబారి. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని చెక్ కాలనీ గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నారు. తమ దేశం పేరిట ఉన్న ఆ కాలనీని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఆయన పర్యటన వివరాలను తెలియజేస్తూ ఢిల్లీలోని ఎంబసీ ఆఫ్ చెక్ రిపబ్లిక్ కార్యాలయం నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ అందింది. సోమవారం మిలన్ హైదరాబాద్ వచ్చి చెక్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక కార్పొ రేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ అనంతరెడ్డి, సలహాదారులు జి.సూర్య శంకర్ రెడ్డి, విశ్వనాథరాజు ఆధ్వర్యంలో కాలనీ వాసులు భారీగా తరలివచ్చి అతిథికి రంగ వల్లులు, పూలతో స్వాగతించారు. మహిళలు బతుకమ్మలతో వెల్కమ్ చెప్పారు. మహిళలతో పాటు మిలన్ సైతం బతుకమ్మ ఆడారు. మిలన్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం కాలంలో తమ దేశ ఇంజనీర్లు నడయాడిన గల్లీలు.. బస చేసిన బంగ్లాలను సందర్శించి ఆనాటి విశేషాలను తెలుసుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త విశ్వనాథరాజు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారు.
‘చెక్ కాలనీ’పేరు ఎలా వచ్చిందంటే..
చెకోస్లేవేకియా పేరు మీద చెక్‌కాలనీకి ఆ పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది. నిజాం కాలంలో సనత్‌నగర్‌లో బ్రెన్ గన్ ఫ్యాక్టరీ (పస్తుత ఓల్టాస్ కంపెనీ) ఉండేది. గన్‌ల తయారీకి వాడే ముడిసరుకులు ఇక్కడ తయారయ్యేవి. వాటి తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం చెకోస్లేవేకియా ఇంజనీర్ల వద్ద ఉండేది. దీంతో ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో ఇంజనీర్లను రప్పించారు. ఇక్కడి నివాస ప్రాంతాలు చెకోస్లేవేకియా ఇంజనీర్లకు అనుకూలంగా లేకపోవడంతో చాలామంది వెనుదిరిగి వెళ్లిపోవడంతో వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగ్లాలను నిర్మించారు. దాదాపు 50 ఎకరాల్లో 52 బంగ్లాలను నిర్మించారు. చెకోస్లేవేకియన్స్ గడ్డగా పిలవడిన ఈ ప్రాంతం రానురాను చెక్‌కాలనీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగ్లాల స్థానంలో 42 అపార్ట్ మెంట్లు వెలిశాయి. మిగతా పది బంగ్లాలు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.
స్వదేశంలా ఫీలయ్యా: మిలన్
హైదరాబాద్‌లో చెక్ ఫ్రెండ్స్ ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. మా దేశస్తులతో గడిపానన్న అనుభూతి కలిగింది. భారత్ నుంచి చెక్ రిపబ్లిక్‌కు వచ్చే వారిలో హైదరాబాద్ వారే ఎక్కువ. దేశవ్యాప్తంగా చెక్ వీసా సెంటర్ల ఏర్పాటుకు మా దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ హైదరాబాద్‌తో సంబంధాలు కొనసాగిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment