దడుభాయ్‌లు
- వ్యాపారులకు రైతులకు అనుసంధానకర్తలుగా దడువాయిలు
- ఉదయం ఎనిమిది గంటలకే విధుల్లోకి..
- దుమ్ముధూళి మధ్యే పని..
- రైతులు తెచ్చిన ఉత్పత్తుల పర్యవేక్షణే ప్రధాన ధ్యేయం
వరంగల్ సిటీ : నిత్యం దుమ్ము,ధూళి మధ్య విధులు నిర్వర్తిస్తూ రైతులకు, వాప్యారులకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్న దడువాయిలంటే రైతులకు ఎనలేని అభిమానం. రైతులు తమ పంట ఉత్పత్తులు తెచ్చింది మొదలు విక్రయించే వరకు వారి వెన్నంటి ఉండే దడువాయిలను రైతులు తమ అన్నదమ్ములుగా భావిస్తారు. 112 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మొత్తంగా 125మంది గుర్తింపు కలిగిన దడువాయిలున్నారు.
వ్యాపారుల దగ్గరి నుంచి గుమాస్తాల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ వీరు ముందుకుసాగుతారు. ఈ మార్కెట్‌కు జిల్లా నుంచేకాకుండా కరీంనగర్, ఖమ్మం, న ల్లగొండ, మెదక్, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పంట ఉత్పత్తులు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం సుమారు 80 నుంచి 90వేల మంది రైతులు మార్కెట్‌కు వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముకుని వెళుతుంటారు.
విధులిలా..
దడువాయిలు ఉదయం 8 గంటలకే విధుల్లో చేరుతారు. డ్యూటీకి రాగానే వివిధ యార్డుల ఇన్‌చార్జ్ ఉద్యోగులు వీరికి చిట్టాబుక్‌లు ఇచ్చి పంట సరుకుల వద్దకు పంపిస్తారు. ఇక అప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేస్తారు. రైతులు తెచ్చిన సరుకు, పేరు, బరువు.. ఇలా అన్ని వివరాలను దగ్గరుండి చిట్టాబుక్‌లో నమోదు చేస్తారు. రైతులు కొంచెం కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. క్రయవిక్రయాలు పూర్తికాగానే ఆ వివరాలను ఓ స్లిప్‌పై రాసి రైతులకు, మరో స్లిప్‌ను మార్కెట్ అధికారులకు అందిస్తారు. వీరి రాసిందే ఫైనల్‌గా అటు అధికారులు, ఇటు వ్యాపారులు, రైతులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషించే దడువాయిలంటే రైతులకు ఎంతో నమ్మకం.
అందుకే మార్కెట్‌లో వారికే సమస్య ఎదురైనా మొదట వీళ్లతోనే మొరపెట్టుకుంటారు. వీరికి మార్కెట్‌లో పత్యేకంగా ఒక కార్యాలయం ఉంది. వీరంతా కలిసి ప్రత్యేకంగా యూనియన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటూ నిజమైన రైతు బాంధవులుగా నిలుస్తున్న దడువాయిలు తమను మార్కెట్ అధికారులుగా గుర్తించాలని పదేళ్లుగా పోరాడుతున్నారు. నిత్యం దుమ్ము, దూళిలో పనిచేస్తుండడంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. నూతన ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని ఆశగా చెబుతున్నారు.
40ఏళ్లకే జబ్బు పడుతున్నాం
నిత్యం దుమ్ము,ధూళి మధ్య పనిచేయడంతో నలభై ఏళ్లకే అనారోగ్యాల బారిన పడుతున్నాం. లెసైన్స్‌డ్ దడువాయిలను మార్కెట్ ఉద్యోగులుగా గుర్తించాలని పదేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.
- పస్తం నర్సింగం,దడువాయి యూనియన్ కార్యదర్శి
మంత్రి హామీ ఇచ్చారు..
దడువాయిల కోసం నెలకోసారి హెల్త్‌క్యాంపులు నిర్వహిం చాలి. గతంలో పలుమార్లు మార్కెటింగ్ శాఖ మంత్రిని కలిసి దడువాయిల సాధకబాధకాలు వివరించాం. ప్రస్తుత మం త్రి హరీష్‌రావు దడువాయిలకు తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. - కందికొండ రాజేందర్, జిల్లా అధ్యక్షుడు, దడువాయి సంఘం
మెరుగైన విధులు..
మార్కెట్‌లోని ఉద్యోగులకంటే దడువాయిలే మెరుగ్గా పనిచేస్తుంటారు. రైతులు తెచ్చిన సరుకుల వివరాలను చిట్టాబుక్కుల్లో నమోదుచేస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు, రైతులకు అందజేస్తుంటారు. వీరి కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు.
- నూర వీరస్వామి, రాష్ట్ర కార్యదర్శి దడువాయి యూనియన్