సబ్సిడీ కందిపప్పు పంపిణీకి బ్రేక్ | Dal subsidy brake distribution | Sakshi
Sakshi News home page

సబ్సిడీ కందిపప్పు పంపిణీకి బ్రేక్

Published Sun, Jun 21 2015 4:35 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Dal subsidy brake distribution

తాండూరు: ఒకవైపు పేద వర్గాలకు అందజేసే సబ్సిడీ కందిపప్పు పంపిణీకి బ్రేక్ పడగా.. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర ఆకాశాన్నంటుతుండటంతో మధ్యతరగతి జీవులు బెంబేలెత్తుతున్నారు. ఈ తరుణంలో సబ్సిడీ కందిపప్పు అందక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. రంజాన్ పండుగ వేళ పేద వర్గాలకు తిప్పలు తప్పని పరిస్థితి. పౌరసరఫరాల శాఖ అధికారులు  జూన్ నెల కోటా పప్పును కేటాయించకపోవడమే ఇందుకు ఉదాహరణ. దీంతో  పౌరసరఫరాల గోదాంలో కందిపప్పు నిల్వలు నిండుకున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా జరగాల్సిన సబ్సిడీ కందిపప్పు పంపిణీ ఆగిపోయింది.
 
  పండగ సందర్భంగా అదనపు చక్కర కోటాను కేటాయించిన సివిల్ సప్లయ్ అధికారులు కందిపప్పు పంపిణీపై మాత్రం శ్రద్ధ చూపకపోవడం గమనార్హం.  జిల్లాలో మొత్తం 1,854 రేషన్ దుకాణాలున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా రూ.49.45 ధరకు కిలో కందిపప్పును పేదలకు పంపిణీ చేస్తారు.  ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా దాదాపు  350-400 మెట్రిక్ టన్నుల కందిపప్పు కోటా అవసరం. కానీ ఈ నెల కోటా ఇంత వరకు కేటాయించలేదు. బహిరంగ మార్కెట్‌లో ఇటీవల కంది పప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కిలో కందిపప్పు రూ.110-రూ.120 ధర పలుకుతోంది. ఈ పరిస్థితిలో అంత ధరతో కందిపప్పును కొనేస్థోమత లేక సామాన్యులు ఇక్కట్లకు గురవుతున్నారు.
 
 కారణాలివీ..  మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖకు ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల నుంచి సప్లయర్ల నుంచి కందిపప్పు నిలిచిపోయింది. ప్రతి మూడు మాసాలకోసారి పౌరసరఫరాల శాఖ  ఉన్నతాధికారులు కందిపప్పు సప్లయ్‌కి సంబంధించి టెండర్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగానే సప్లయర్లతో కందిపప్పు టెండర్ల కాంట్రాక్టులో ఆలస్యానికి కారణమవుతోందని తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల గోదాం (ఎంఎల్‌ఎస్ పాయింట్)లకు కందిపప్పు కోటా చేరలేదు. మే నెల కోటాను పంపిణీ చేసిన అధికారులు జూన్ మాసం కోటా అలాట్‌మెంట్ చేయకపోవడంతో పేదలకు కందిపప్పు పంపిణీకి బ్రేక్ పడింది.
 
 టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది: సత్యం, డీఎం
 సప్లయర్లతో కాంట్రాక్టు ఇంకా ఖరారు కానందున ఈ నెల కంది పప్పు కోటా కేటాయింపులు జరగలేదని శనివారం సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ సత్యం చెప్పారు. ఈ కారణంతోనే ఈ నెల కందిపప్పు పంపిణీలో ఆలస్యానికి కారణమన్నారు. సోమ, మంగళవారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది .ఈ ప్రక్రియ ముగియగానే కందిపప్పు పంపిణీ ప్రారంభమవుతుందని డీఎం వివరించారు. రంజాన్ పండగ కోసం జిల్లా వ్యాప్తంగా 1,195 మెట్రిక్ టన్నుల అదనపు చక్కర కోటాను కేటాయించినట్టు డీఎం తెలిపారు. లబ్ధిదారులకు ఒక కిలో చక్కర అదనంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement