ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్‌ ర్యాంకర్‌ | Dammapeta Irrigation AEE Caught by ACB at Sathupally Bus Stand About the Bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్‌ ర్యాంకర్‌

Published Wed, Jul 17 2019 9:22 AM | Last Updated on Wed, Jul 17 2019 9:23 AM

Dammapeta Irrigation AEE Caught by ACB at Sathupally Bus Stand About the Bribe - Sakshi

పట్టుబడిన నగదుతో ఇరిగేషన్‌ ఏఈఈ నర్సింహారావు

సత్తుపల్లి:   ఏసీబీకి అవినీతి జలగ చిక్కింది.. సత్తుపల్లి బస్టాండ్‌లో లంచం తీసుకొని  బస్సు ఎక్కుతుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకోవటంతో జనంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కిటకిటలాడుతున్న బస్టాండ్‌ ప్రాంగణంలో మంగళవారం సివిల్‌ దుస్తుల్లో ఏసీబీ అధికారులు లంచగొండిని పట్టుకొని తీసుకెళ్తుంటే ప్రజలు వింతగా చూశారు. రెండు నెలల వ్యవధిలో సత్తుపల్లిలో రెండోసారి ఏసీబీ అధికారులు దాడులు,  అరెస్ట్‌లు చేయటం చర్చనీయాంశమైంది. మార్చి 27న సత్తుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.18వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో పద్దం వెంగళరావు పట్టుబడిన విషయం విదితమే.  

ఎలా పట్టుకున్నారంటే..   
దమ్మపేట నీటపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న పంది నర్సింహారావు మిషన్‌ కాకతీయ చెరువుల బిల్లుల చెల్లింపుల్లో లంచం అడగడంతో కాంట్రాక్టర్‌  వెంకట్రామయ్య రూ.10వేలు  తీసుకొని ఏఈఈకి ఫోన్‌ చేశాడు. సత్తుపల్లి బస్టాండ్‌లో ఉన్నాను.. వచ్చి డబ్బులు ఇవ్వండి అని చెప్పటంతో అతని వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ ఇన్‌చార్జ్‌ డీఎస్సీ ప్రతాప్‌(వరంగల్‌), సీఐలు ఎస్‌వీ రమణమూర్తి, బి.ప్రవీణ్, పి.వెంకట్‌లు దాడి చేసి ఇరిగేషన్‌ ఏఈఈ నర్సింహారావును పట్టుకున్నారు. అక్కడి నుంచి సత్తుపల్లి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ చేశారు. ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పంది నర్సింహారావు ఐఐటీలో టాప్‌ ర్యాంకర్‌. రెండేళ్ల క్రితమే ఉద్యోగంలో చేరాడు.

 అసలు విషయం ఏమిటంటే..  
రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన  వెంకట్రామయ్య భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారంలోని కారం లక్ష్మీకుంట రూ.15 లక్షలు, పట్వారిగూడెంలోని కారం కన్నప్పకుంట రూ.16 లక్షల విలువైన రెండు చెరువులను 2017లో మిషన్‌ కాకతీయ మూడవవిడతలో ఆన్‌లైన్‌ ద్వారా టెండర్‌ దక్కించుకున్నాడు. 2018లో పార్టు బిల్లు కింద రెండు చెరువులకు కలిపి రూ.14.10 లక్షలను చెల్లించారు. మిగిలిన ఫైనల్‌ బిల్లు చేసేందుకు ఏడాది నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. పనులు చేసేటప్పుడు కూడా ప్రతిపాదనలో లేని పనులను కూడా చేయించారు. బిల్లులు చెల్లించమంటే లంచం కావాలంటూ డిమాండ్‌ చేస్తుండటంతో డబ్బులన్నీ పనులకే ఖర్చు పెట్టాను.. మీరు బిల్లు చేయండి.. డబ్బులు ఇచ్చేస్తానంటూ విన్నవించుకున్నా ఫలితం కన్పించలేదు. రూ.15వేలు ఇస్తేనే బిల్లు చేస్తామని ఏఈఈ తిప్పుతుండగా భరించలేక హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అక్కడ నుంచి ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి కేసును రిఫర్‌ చేయటంతో ఏసీబీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement