‘మృత్యు’ ప్రయాణం! | Dangerous journey in the state | Sakshi
Sakshi News home page

‘మృత్యు’ ప్రయాణం!

Published Sat, Mar 31 2018 12:46 AM | Last Updated on Sat, Mar 31 2018 12:46 AM

Dangerous journey in the state - Sakshi

...ఇది నక్కర్తమేడిపల్లి నుంచి పల్లెచెల్కతండాకు విద్యార్థులు ఆటోలో వెళుతున్న దృశ్యం.  నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్తమేడిపల్లి మార్గంలో ఉన్న మల్కీజ్‌గూడ, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాలకు ప్రయాణించాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. నిత్యం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితిలో వెళ్లక తప్పని దుస్థితి ఇది. లోపలా పైనా.. జనమే..

సాక్షి నెట్‌వర్క్‌ :  రాష్ట్రంలో ప్రయాణం ప్రమాదంలో పడింది. మారుమూల పల్లెలు, తండాలు, కొన్నిచోట్ల మండల కేంద్రాల నుంచీ ప్రజలు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడం, నడిచినా పొద్దున ఓ ట్రిప్పు, సాయంత్రం మరో ట్రిప్పు మాత్రమే ఉంటుండటంతో జనాలకు ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పోటీలు పడి పరుగులు తీయించడం, సరిగా లేని రోడ్లు, ఫిట్‌నెస్‌ లేని వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

దాంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో ఓ ఆటో వ్యవసాయ బావిలో పడిపోయి 11 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అందులో ఆరుగురు చిన్నారులుకాగా, ఐదుగురు మహిళలు ఉండటం ఆందోళనకరం. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నూ ఈ తరహా పరిస్థితి ఉంది.  సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ నుంచి నారాయణఖేడ్‌కు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతున్న ఆటో ఇది. లోపల 20 మంది, టాప్‌పైన మరికొంత మంది.. అసలే గుంతల రోడ్డు.. మితిమీరిన వేగం.. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ దుర్ఘటన జరగక తప్పని పరిస్థితి.

నిబంధనలున్నా.. పాటించే వారేరీ?
ఆటోలు, జీపుల్లో కచ్చితంగా పరిమితిని పాటించాలి. దీనిని పాటించేవారే లేరు. ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న వారెవరికీ ప్రమాద బీమా కూడా వర్తించదు.
 డ్రైవింగ్‌ చేసేప్పుడు సెల్‌ఫోన్లు వాడడం నిషేధం. ప్రైవేటు వాహనాల వారు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఆటోల్లో అయితే పెద్ద ధ్వనితో పాటలు పెట్టి నడుపుతూ ఉంటారు. దానివల్ల ఎవరైనా హారన్‌ కొట్టినా వినపడే పరిస్థితి ఉండదు.

అరకొర బస్సులు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలకు సరిగా బస్సు సౌకర్యం లేదు. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు బస్సు సర్వీసు మాత్రమే ఉన్న గ్రామాలు ఎన్నో. ఇక తండాల పరిస్థితి మరీ దారుణం. రోడ్డు కూడా సరిగా ఉండదు. ఆటోల్లో ప్రయాణం కూడా ప్రమాదకరమే. నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళితేగానీ వాహనం ఎక్కలేని పరిస్థితి.

పలు చోట్ల సరైన రోడ్డు ఉన్నప్పటికీ బస్సులు నడపడం లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో వాటికి 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి ఆటోలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. రోడ్లు సరిగా ఉండకపోవటం, మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మైనర్లు నడుపుతుండటం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ఇయర్‌ ఫోన్‌లో పాటలు వింటూ డ్రైవింగ్‌ చేస్తుండటం వంటివి ఎక్కడ చూసినా కనిపిస్తుండటం ఆందోళనకరం.

ప్రాణాలతో చెలగాటం
 రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు నాలుగైదు కిలోమీటర్ల దూరం లో విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి కాలేజీలైతే పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. చాలామంది విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
 ఇక తెల్లవారక ముందే కూలీలు ఉపాధి కోసం బయలుదేరుతారు. పనుల కోసం పది ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోలపైనా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా కూలీలతో వెళ్తున్న ఆటోలు బోల్తాపడడం, వాహనాలను ఢీకొనడం వంటి ఘటనల్లో పేద కూలీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

మంది బలయ్యారు
కిందటేడాది అక్టోబర్‌ 20వ తేదీన రాత్రి వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. వారంతా మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం నందమూరినగర్‌కు చెందిన వారు.

బస్సు రాదు.. రోడ్డు సరిగా లేదు..
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో సుమారు 60 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యమున్నా.. ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు తిరుగుతాయి. దాంతో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ వందలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
 గద్వాల జిల్లాలో రోజూ సుమారు 50 వేల మందికిపైగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారని అంచనా. వనపర్తి జిల్లాలో 250కి పైగా జనావాసాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. వారికి ప్రైవేటు వాహనాలే దిక్కు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి. నిత్యం జిల్లాలో ప్రైవేటు వాహనాల్లో రెండు లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు.
 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో ఆటోలు, జీపులు తిరుగుతున్నాయి. వాటిలో నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. సూర్యాపేట జిల్లాలో బస్సులు నడవని గ్రామాలు 30 వరకు ఉన్నాయి.
 ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారు 35 వేల వరకు ఆటోలు, తుఫాన్‌లు, జీపులు ఉన్నాయి. వీటిల్లో రోజూ మూడున్నర లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజూ సుమారు లక్షన్నర మంది వరకు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తారు.

బస్సుల్లో  ప్రయాణిస్తేనే రక్షణ
ప్రయాణికులు తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న హడావుడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూడాలి. బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యం చేరవచ్చు. – శంకర్‌నాయక్, ఖమ్మం ఇన్‌చార్జి ఆర్టీవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement