షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులో శుక్రవారం అర్ధరాత్రి దారిదోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. మూడు లారీలను ఆపి కత్తులు, గొడ్డళ్లు చూపిస్తూ లారీ డ్రైవర్ల వద్ద అందిన కాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డుపై మూడు అడుగుల ఎత్తున గడ్డి కనిపించింది.
అదే సమయంలో షాద్‌నగర్ నుంచి పరిగి వైపు వెళ్తున్న మూడు లారీలు వాటిని దాటలేక ఆగిపోయాయి. అక్కడే చెట్ల పొదల్లో దాగి ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లారీ డ్రైవర్లకు కత్తులు, గొడ్డలి చూపిస్తూ బెదిరించారు. వాహనాల లైట్లు ఆర్పించిన అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులివ్వాలని హెచ్చరించారు. ప్రాణభయంతో వారివద్ద ఉన్న సుమారు రూ.16వేల నగదును దొంగల చేతిలో పెట్టగా క్షణాల్లో వాటిని తీసుకొని పొదల్లోకి వెళ్లి పారిపోయారు.
సంఘటననుంచి తేరుకున్న లారీ డ్రైవర్లు తమ సెల్‌ఫోన్ ద్వారా 100 నంబరుకు డయల్ చేసి పోలీసులకు విషయం తెలియచేశారు. సంఘటన స్థలానికి కొందుర్గు ఎస్‌ఐ సత్యనారాయణ చేరుకొని పరిశీలించారు. ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి వచ్చే వరకు రోడ్డుపై ఉన్న గడ్డిని తొలగించకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఆర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం ఆయన సిబ్బందితో ట్రాఫిక్ క్లియర్ చేయించి సమీపంలోని అప్పారెడ్డిగూడ గ్రామంలో విచారించారు. లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దారికాచి.. కత్తులతో బెదిరించి
Published Sun, Nov 23 2014 4:15 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement