
నాకో న్యాయం.. కమిషనర్‌కో న్యాయమా..?
- బదిలీ ఉత్తర్వులు రాకముందే వాహనం వాడొద్దని ఆదేశించారు
- మరి కమిషనర్ భార్యకు ప్రభుత్వ వాహనం,కానిస్టేబుల్‌ను డ్రైవర్‌గా వాడొచ్చా..?
- సిద్దిపేట పోలీస్ కమిషనర్‌పై సీఐ భూమయ్య సంచలన ఆరోపణలు
హుస్నాబాద్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్‌పై హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య సంచలన ఆరోపణలు చేశారు. తన బదిలీ ఉత్తర్వులు రాకముందే ప్రభుత్వ వాహనం వాడొద్దని, స్టేషన్‌లోని తన కుర్చీపై కూర్చో వద్దని ఆదేశాలు జారీ చేశారని, మరి కమిషనర్ భార్య ప్రభుత్వ వాహనాన్ని, కానిస్టేబుల్‌ను డ్రైవర్‌గా వాడొచ్చా అని ప్రశ్నించారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో ఉన్నతాధికారిపై సీఐ స్థాయి అధికారి బహిరంగంగా ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ భూమయ్య మాట్లాడుతూ, కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమిషనర్ వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయానని ఆరోపించారు. దాదాపు 20 రోజుల క్రితం సిక్ లీవ్‌పై వెళ్లానని చెప్పారు. తిరిగి వస్తే.. బదిలీ అయినందున విధుల్లోకి చేరవద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అసలు తాను బదిలీ అయినట్లు ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు. ఒక ఉద్యోగిగా సర్కార్ వాహనం వాడొద్దని చెప్పడం ఇదెక్కడి న్యాయమని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కమిషనర్ భార్య ప్రభుత్వ వాహనం వాడుకుంటూ.. కొహెడకు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును డ్రైవర్‌గా పెట్టుకుంటే తప్పు లేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న కమిషనర్ భార్యకు ఇదే వాహనానికి బెజ్జంకి కానిస్టేబుల్ సారంగపాణిని డ్రైవర్‌గా పని చేయించు కుంటున్నారని ఆరోపించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం నిర్మిస్తే, వాటి లెక్కలు అడిగినం దుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.
సీఐ ఆరోపణల్లో వాస్తవం లేదు: ఏసీపీ
సిద్దిపేట రూరల్: హుస్నాబాద్ సీఐ భూమయ్య పోలీసు కమిషనర్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. భూమయ్య ఈ నెల 10 నుంచి సెలవులో ఉన్నట్లు తెలిపారు. మూడురోజుల క్రితం భూమయ్య డీఐజీ ఆఫీస్‌కు బదిలీ అయినట్లు చెప్పారు. ఆదివారం భూమయ్య తన కార్యాలయానికి వచ్చి రిలీవ్ ఆర్డర్ తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు.