SIDDIPET Police Commissioner
-
నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి
సాక్షి, సిద్దిపేట: క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసే డాటాలో తప్పులుండొద్దని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు సీసీటీఎన్ఎస్, కోర్టు మానిటర్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా.. ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, అందు కోసం కన్వెక్షన్(నిందుతులకు శిక్ష పడే రేటు) పెంచాలన్నారు. దీని ద్వారా ప్రజల్లో డిపార్ట్‌మెంట్‌పై మంచి అభిప్రాయం కలుగుతుందని, అలాగే క్రైమ్ రేటు తగ్గుతుందని సూచించారు. ట్రయల్ నడిచే కేసుల్లో సాక్ష్యం ఎలా చెప్పాలో ముందే ప్రిపేర్ చేయాలని, కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కమిషనరేట్ పరిధిలో సీఐలు, ఎస్ఐలు కొన్ని ముఖ్యమైన కేసులు అడాప్ట్ చేసుకోవడం జరిగిందని, ఆ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. సుప్రీం కోర్టు పోక్సో కేసులపై ఒక కమిటీ మానిటర్ చేస్తుందని, రాష్ట్రంలో ఉమెన్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులు సీసీటీఎన్ఎస్ మానిటర్ చేస్తున్నారన్నారు. అందువల్ల డాటా ఎంట్రీ చేసేపుడు ఏలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. పోలీస స్టేషన్ల వారీగా యాక్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో త్వరలో లిస్ట్ అవుట్ చేసి పంపాలన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యేంతవరకు అవసరమైన పత్రాలు, సాక్షుల వాంగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో బాధ్యతగా ఉండాలన్నారు. కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు విధులలో ప్రతిభ కనబర్చి నిందితులకు శిక్షలు పడేవిధంగా పనిచేసే సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామన్నారు. సీసీటీఎన్ఎస్ కోర్టు మానిటర్ సిస్టంలో డాటా ఏ విధంగా ఏంట్రీ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కోర్స్ సిబ్బంది శ్రీధర్, స్వామిలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీటీఎస్ఎన్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ హబీబ్‌ఖాన్, టాస్క్‌ఫోర్స్ సీఐ లక్ష్మణ్, కోర్టు లైజనింగ్ హెడ్‌కానిస్టేబుల్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉలిక్కిపడ్డ ధర్మాజిపేట
దుబ్బాకటౌన్: దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజిపేటలో గురువారం తెల్లవారుజామున సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీ సులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. సీపీ శివకుమార్, డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో దుబ్బాక సీఐ నీరంజన్, ఎస్ఐ సుభాష్గౌడ్తో పాటు మిరుదొ డ్డి, చిన్నకోడూర్ ఎస్ఐలు.. మొత్తం 65 మంది సిబ్బం ది బ్యాచ్‌లుగా విడిపోయి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 94 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 2 కార్లు, 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని గుర్తించా రు. వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ శివకుమార్.. ఎస్ఐ సుభాష్‌గౌడ్‌కు సూచించారు. గతంలో 30 నేరాలతో సంబంధం ఉన్న భిక్షపతితో పాటు పలు నేరాలు చేసిన కాస్తి కనకయ్య, శ్రీనివాస్‌ను విచారణ చేశారు. ఆందోళనకు గురైన ప్రజలు తెల్లవారుజామున 5 గంటలకు ఒక్కసారిగా ధర్మాజిపేటను పోలీసులు చట్టుముట్టడంతో ప్రజలు ఆందోళన చెందారు. గతంలో నక్సలైట్ల కోసం పోలీసులు గ్రామాలను చుట్టుముట్టేవారు.. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి సంఘటలన ఏదైనా జరుగుతుందేమోనని ధర్మాజీపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులు అన్ని వివరాలు చెప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. నేర రహిత సమాజం కోసమే.. నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా నిరంతరం పనిచేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. గురువారం ధర్మాజిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల అదుపునకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల మేలు కోసమే కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు తమ వాహనాల ఆర్సీ, ఇన్సురెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సీపీ సూచించారు. -
‘ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు’
-
‘ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు’
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ జులుంపై పోలీసు కమిషనర్ శివకుమార్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరి వాదనే వినడం సరికాదని, ఇరువైపుల వాదనలు వినాలని సూచించారు. ఒకవేళ ఎస్ఐ తప్పుచేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సివిల్ వివాదాల్లో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకోకుండా ప్రయత్నిస్తున్నామని మిరుదొడ్డి ఘటన తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సిద్ధిపేట పోలీసు కమిషనర్‌కు నిజాయితీ ఉంటే ఎస్ఐ సతీష్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ డిమాండ్ చేశారు. ‘దివ్యాంగుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బెదిరించే పరిస్థితి ఉంటుందా? కమిషనర్‌కు ఆ విషయం తెలియదా? ఇందులో విచారించడానికి ఏముంది? ఎస్ఐ సతీష్‌ను కమిషనర్ వెనకేసుకు రావడం సరికాద’ని రఘునాథ్ అన్నారు. -
నాకో న్యాయం.. కమిషనర్‌కో న్యాయమా..?
బదిలీ ఉత్తర్వులు రాకముందే వాహనం వాడొద్దని ఆదేశించారు మరి కమిషనర్ భార్యకు ప్రభుత్వ వాహనం,కానిస్టేబుల్‌ను డ్రైవర్‌గా వాడొచ్చా..? సిద్దిపేట పోలీస్ కమిషనర్‌పై సీఐ భూమయ్య సంచలన ఆరోపణలు హుస్నాబాద్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్‌పై హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య సంచలన ఆరోపణలు చేశారు. తన బదిలీ ఉత్తర్వులు రాకముందే ప్రభుత్వ వాహనం వాడొద్దని, స్టేషన్‌లోని తన కుర్చీపై కూర్చో వద్దని ఆదేశాలు జారీ చేశారని, మరి కమిషనర్ భార్య ప్రభుత్వ వాహనాన్ని, కానిస్టేబుల్‌ను డ్రైవర్‌గా వాడొచ్చా అని ప్రశ్నించారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో ఉన్నతాధికారిపై సీఐ స్థాయి అధికారి బహిరంగంగా ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ భూమయ్య మాట్లాడుతూ, కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమిషనర్ వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయానని ఆరోపించారు. దాదాపు 20 రోజుల క్రితం సిక్ లీవ్‌పై వెళ్లానని చెప్పారు. తిరిగి వస్తే.. బదిలీ అయినందున విధుల్లోకి చేరవద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అసలు తాను బదిలీ అయినట్లు ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు. ఒక ఉద్యోగిగా సర్కార్ వాహనం వాడొద్దని చెప్పడం ఇదెక్కడి న్యాయమని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కమిషనర్ భార్య ప్రభుత్వ వాహనం వాడుకుంటూ.. కొహెడకు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును డ్రైవర్‌గా పెట్టుకుంటే తప్పు లేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న కమిషనర్ భార్యకు ఇదే వాహనానికి బెజ్జంకి కానిస్టేబుల్ సారంగపాణిని డ్రైవర్‌గా పని చేయించు కుంటున్నారని ఆరోపించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం నిర్మిస్తే, వాటి లెక్కలు అడిగినం దుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. సీఐ ఆరోపణల్లో వాస్తవం లేదు: ఏసీపీ సిద్దిపేట రూరల్: హుస్నాబాద్ సీఐ భూమయ్య పోలీసు కమిషనర్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. భూమయ్య ఈ నెల 10 నుంచి సెలవులో ఉన్నట్లు తెలిపారు. మూడురోజుల క్రితం భూమయ్య డీఐజీ ఆఫీస్‌కు బదిలీ అయినట్లు చెప్పారు. ఆదివారం భూమయ్య తన కార్యాలయానికి వచ్చి రిలీవ్ ఆర్డర్ తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు.