గూగుల్ ఇమేజెస్‌లో కుట్ర అని టైప్ చేయగానే కేటీఆర్ చిత్రాలు వస్తోన్న దృశ్యం
హైదరాబాద్ : రాజకీయ కుట్రలలో వయసుకు మించి మీరు(కేటీఆర్) ఆరి తేరారని, అందుకేనేమో ‘కుట్ర’ అని గూగుల్ ఇమేజెస్‌లో సెర్చ్ చేస్తే, మీ ఫోటోలు కుట్ర అనే పదానికి పర్యాయపదంగా ఉన్నట్లుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకుంటే.. మీరేమో ఇంటిల్లిపాదీ పదవులు అనుభవిస్తున్నారని కేసీఆర్ కుటుంబాన్నిఉద్దేశించి లేఖలో వ్యాఖ్యానించారు. మీ కుటుంబానికి రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. మోదీ తెలంగాణ బిల్లుపై విచ్చలవిడిగా మాట్లాడుతుంటే విమర్శించాల్సింది పోయి మెప్పుకోలు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.
పార్లమెంటులో తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని ప్రధాని మోదీ తూలనాడుతుంటే టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీ మాట్లాడగానే ఇక్కడ టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎయిమ్స్, పోలవరం ముంపు, రైల్వే జోన్ ఇలా వేటికి బడ్జెట్ లో నిధులు ఇవ్వకున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. మోదీతో ఉన్న లోపాయికరి ఒప్పందం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కేటీఆర్ తాకట్టు పెట్టారని ఘాటుగా విమర్శించారు. మోదీతో లోపాయికారి ఒప్పందంపై గన్ పార్క్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment