బస్సు పోయింది... బోర్డు మిగిలింది! | Day after theft, bus found ripped apart in Nanded | Sakshi
Sakshi News home page

బస్సు పోయింది... బోర్డు మిగిలింది!

Published Fri, Apr 26 2019 12:37 AM | Last Updated on Fri, Apr 26 2019 12:37 AM

Day after theft, bus found ripped apart in Nanded - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: మూడ్రోజుల క్రితం గౌలిగూడ బస్టాండ్‌లో అపహరణకు గురైన ఆర్టీసీ బస్సును పోలీసులు గుర్తించారు. కుషాయిగూడ డి పోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ (ఏపీ 11 జెడ్‌ 6254)బస్సును అఫ్జల్‌గంజ్‌ పోలీసులు మహారాష్ట్ర లోని నాందేడ్‌లో స్వాధీనం చేసుకున్నారు. బస్సు అదృశ్యంపై నగర పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా గౌలిగూడ నుంచి బస్సు మాయమైన తర్వాత తూప్రాన్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ సహాయంతో తూప్రాన్‌ టోల్‌గేట్‌ వద్ద నమోదైన సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలించగా..బస్సు అదే మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. తూప్రాన్‌ దాటి నిర్మల్, భైంసాల మీదుగా నాందేడ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ దేవేందర్‌ పర్యవేక్షణలో 9 మంది పోలీసుల బృందం నాందేడ్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సును భాగాలుగా విడదీస్తున్న మెకానిక్‌ షెడ్‌ను స్థానిక పోలీసుల సహకారంతో  గుర్తించారు. పోలీసులు రావడంతో దొంగిలించిన వ్యక్తులు పరారీ కాగా బస్సు విడి భాగాలను విప్పుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో... 
కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్‌ మధ్య రాకపోకలు సాగించే సిటీ బస్సును మంగళవారం రాత్రి ఆఖరి ట్రిప్పు తర్వాత వెంకటేశం కండక్టర్‌ రాహుల్‌లు అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీబీఎస్‌ డిపో–1లో పార్క్‌ చేసి పక్కనే ఉన్న విశ్రాంతి భవనంలో నిద్రపోయారు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో విధులకు సిద్ధమయ్యే క్రమంలో డ్రైవర్‌ బస్సు కోసం వచ్చాడు. కానీ అప్పటికే తాను పార్కింగ్‌ చేసిన చోట బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందజేశాడు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

బస్‌స్టేషన్‌లు, డిపోల్లో భద్రతను పెంచండి: రవాణా మంత్రి 
బస్సు అపహరణ ఉదంతంపై రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బస్‌స్టేషన్‌లు, డిపోల్లో భద్రతను పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఎక్కడెక్కడ భద్రతా లోపాలున్నాయో గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు రవీందర్, వినోద్‌ కుమార్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement