పట్టపగలు హత్యాయత్నం | Daylight attempt | Sakshi
Sakshi News home page

పట్టపగలు హత్యాయత్నం

Published Thu, Sep 11 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

పట్టపగలు హత్యాయత్నం

పట్టపగలు హత్యాయత్నం

  •      పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు
  •      భూవివాదాలే కారణం
  •      బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద ఘటన
  • బీబీనగర్ :  పట్టపగలు... అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. హోటల్‌లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వేటకొడవలి, కర్రలతో విరుచుకుపడ్డారు. బాధితుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర భయాందోళన రేకెత్తించిన ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది.

    పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండమడుగు గ్రామానికి చెందిన సయ్యద్ హైదర్జ్రా కొంతకాలంగా హైదరాబాద్‌లోని రెయిన్‌బజార్‌లో ఉంటున్నాడు. ఇతను కొండమడుగులోని పీర్ల కొట్టం ముతావళి నిర్వహణ, గ్రామ పరిధిలోని వక్ఫ్ భూముల సంరక్షణ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. అదే గ్రామంలో ఉండే పెద్దనాన్న కుమారుడు మక్బూల్‌తో  హైదర్జ్రాకు పీర్లకొట్టం, వక్ఫ్‌భూముల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి.

    బుధవారం ఉదయం గ్రామానికి వచ్చిన హైదర్జ్రా పీర్ల కొట్టానికి వెళ్లగా.. మక్బూల్ అతడితో గొడవపడి వెళ్లిపోయాడు.  అనంతరం హైదర్జ్రా కొండమడుగు మెట్టు వద్ద జాతీయ రహదారి పక్కన గల న్యూషాలిమార్ హోటల్‌లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఇదే సమయంలో మక్బూల్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే హైదర్జ్రాపై కత్తులు, కర్రలతో దాడి చేశాడు.  

    తలపై కత్తితో వేటు పడటంతో బాధితుడు పెద్దగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకోగా దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలకు గురైన హైదర్జ్రాను ఉప్పల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా హత్యాయత్నానికి పాల్పడిన మక్బూల్ బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తానే దాడి చేశానని లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement