‘డీసీఎంఎస్’ సమావేశం వాయిదా | DCMS meeting postponed | Sakshi
Sakshi News home page

‘డీసీఎంఎస్’ సమావేశం వాయిదా

Published Mon, Aug 11 2014 12:24 AM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM

DCMS meeting postponed

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ ఐర నారాయణరెడ్డిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో సోమవారం జరుగనున్న ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. ఏడుగురు డెరైక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావు నిర్ణయించారు. ఈ మేరకు డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో ైచైర్మన్ నారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేసేలా కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల కాపీని శనివారం డీసీవో కార్యాలయం నోటీసు బోర్డులో స్వయంగా నారాయణరెడ్డి అతికించారు. అలాగే ఆదివారం డీసీవో కార్యాలయానికి వెళ్లి సూపరింటెండెంట్ ఆత్మారాంకు కూడా కోర్టు ఉత్తర్వుల కాపీని అందజేశారు. న్యాయస్థానం ఆదేశాలు అధికారికంగా ఆదివారం సాయంత్రం తమకు అందాయని.. ఈ మేరకు సోమవారం నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావు ‘సాక్షి’ప్రతినిధితో తెలిపారు.

 పక్షం రోజులుగా క్యాంపులు
 డీసీఎంఎస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన డెరైక్టర్లు పక్షం రోజులుగా క్యాంపులో ఉన్నారు. ఏడుగురు సభ్యులు హైదరాబాద్, శ్రీశైలం, మహారాష్ట్రలో గడిపారు. ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం ఈ ఏడుగురు సభ్యులు నేరుగా డీసీఎంఎస్ కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయి. డీసీఎంఎస్ చైర్మన్ రేసులో తాంసి మండలం జామిడి పీఏసీఎస్ చైర్మన్ వినోద్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకు మంత్రి జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీస్సులున్నాయి.

 పావులు కదుపుతున్న మంత్రి, ఐకే రెడ్డి?
 డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డిపై అవిశ్వాసం విషయంలో నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్ నారాయణరెడ్డి ఒకప్పుడు ఐకేరెడ్డి అనుచరుడే. రెండు పర్యాయాలు నారాయణరెడ్డి డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. మొదటిసారి ఇంద్రకరణ్‌రెడ్డే చొరువ చూపి నారాయణరెడ్డిని డీసీఎంఎస్ చైర్మన్ అయ్యేలా చక్రం తిప్పారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో నారాయణరెడ్డి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డికి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన మహేశ్వర్‌రెడ్డికి మద్దతిచ్చారు. దీంతో నారాయణరెడ్డిపై పెట్టిన అవిశ్వాసం విషయంలో వినోద్‌రెడ్డికి అనుకూలంగా ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరువ చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement