* హెరిటేజ్ పాల కల్తీ అంశంపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
* ప్రశ్నోత్తరాల సమయంలో పాల కల్తీ అంశంపై చర్చ
* హెరిటేజ్ ప్రస్తావనతో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
* చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్
* ఆ సంస్థ పాలను నిషేధించాలన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
* పరస్పర నినాదాలతో సభ రెండుసార్లు వాయిదా
* కల్తీపై కఠిన చర్యలు చేపడుతున్నామన్న రాజయ్య
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలలో కల్తీపై అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలతో తెలంగాణ శాసనసభ బుధవారం దద్దరిల్లింది. పరస్పర నినాదాలతో సభ మారుమోగింది. కల్తీకి పాల్పడుతున్న హెరిటేజ్ కంపెనీ పాలను నిషేధించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, దానిపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా హైదరాబాద్‌లో కల్తీ పాల సరఫరా అంశం ప్రస్తావనకు వచ్చింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు పశువులకు హానికరమైన ఇంజెక్షన్లు ఇస్తున్నారని పలువురు సభ్యులు మాట్లాడిన సందర్భంగా హెరిటేజ్ పాలలో కల్తీ విషయం చర్చకు వచ్చింది.
ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు టీడీపీ సభ్యులు రాజేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి కూడా పాలలో కల్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ కూడా కల్తీ పాలు అమ్ముతోందన్నారు. కేరళ ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించినట్లు పత్రికల్లో వచ్చిందని, దానిపై తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలపడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్పించుకున్నారు. అది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెందిన సంస్థ అని, దాన్ని నిషేధించాలో వద్దో టీడీపీ ఎమ్మెల్యేలే చెప్పాలని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ కల్తీ వల్ల పిల్లలకు పాలు తాగించాలంటే భయం వే స్తోందన్నారు. పాల రూపంలో విషం తాగుతున్నామన్నారు. సామాజిక రుగ్మతగా మారిన పాల కల్తీపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కేరళలో హెరిటేజ్‌ను రద్దు చేశారన్నది ఎంత వర కు నిజమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ సంస్థ ఎన్ని పాల ను విక్రయిస్తోందని, ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం టి.రాజయ్య సమాధానమిస్తూ.. హెరిటేజ్ సంస్థ కల్తీ పాల విక్రయం, కేరళలో నిషేధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్) చట్టం ప్రకారం చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని, జిల్లాల్లోనూ అధికారులను నియమించామని చెప్పారు. మం త్రి మాట్లాడుతుండగానే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తది తరులు పట్టుబట్టారు. అవకాశం ఇవ్వకపోవడం తో నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
హెరిటేజ్ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ.. పాలల్లో కల్తీపై ప్రశ ్న వేసిందీ, చర్చనుప్రారంభించిందీ టీడీపీ సభ్యులేనన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు ప్రస్తావిస్తే ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నిం చారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో.. ‘ఇక్కడ హెరిటేజ్ సంస్థ డెరైక్టర్, ప్రతినిధులు లేరు.. మీరు మాత్రం వారిలాగే వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి నామినేట్ అయినవారిలా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత తొత్తులుగా వ్యవహరించడం తెలంగాణ ప్రజల దురదృష్టం. మీరు ఆ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడటం దారుణం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడారు.
రాష్ట్రంలో పాల కల్తీని తేల్చేందుకు ‘ఐపీఎం’ను రెఫరల్ ల్యాబ్‌గా గుర్తించామన్నారు. 32 పాల నమూనాలను సేకరించగా 11 నమూనాల్లో కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. పంజాగుట్టలో సేకరించిన హెరిటేజ్ టోన్డ్ మిల్క్ శాంపిల్‌లో డిటర్జెంట్ కలిపినట్లు తేలిందన్నారు. దీంతో టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు. అనంతరం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించినా టీడీపీ సభ్యులు నినాదాలను కొనసాగించడంతో సభను మళ్లీ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఏమిటీ పాపాలు!
Published Thu, Nov 13 2014 1:28 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM
Advertisement
Advertisement