గతేడాది జూలై నుంచి వర్తింపజేస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 3.144 శాతం పెంచింది. గత ఏడాది జూలై నుంచి ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీన అందుకునే వేతనం (మార్చి నెల జీతం) నుంచి ఈ పెరిగిన డీఏను నగదుగా చెల్లిస్తామని... బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 12.052 శాతం డీఏ అమల్లో ఉంది.
తాజా పెంపుతో ఇది 15.196 శాతానికి చేరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం జీవో నం.25 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు, బోధన, బోధనేతర సిబ్బందికి పెరిగిన డీఏ వర్తిస్తుంది. గత ఏడాది జూలై నుంచి ఫిబ్రవరి నెల వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్‌ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. ఈ ఏడాది మే 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మాత్రం మొత్తం బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు.
జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులు ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి ఈ నెల 15వ తేదీలోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలోని ఉద్యోగులందరూ డీఏ బకాయిలు క్లెయిమ్ చేసినట్లుగా డీడీవోలు ధ్రువీకరణ పత్రం జత చేస్తేనే... మే నెల వేతన బిల్లులు పాస్ చేయాలని ఆదేశించింది. అయితే పెన్షనర్లకు సంబంధించిన డీఏ ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు 3.144% డీఏ పెంపు
Published Wed, Mar 9 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement