బతుకుదెరువుకు భరోసా ఇస్తాం
చావు పరిష్కారం కాదు
♦ ‘నేను సచ్చిపోతున్న’ కథనంపై మంత్రి కేటీఆర్ స్పందన
♦ నేతన్న కుటుంబాన్ని కలిసిన మంత్రి పీఎస్.. బాధిత కుటుంబానికి హామీ
♦ పక్షం రోజులుగా ఆచూకీ లేని రవీందర్
♦ ‘సాక్షి’ కథనానికి కదిలిన అధికారులు
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న ‘నేను సచ్చిపోతున్న..’ అంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు వాయిస్ మెసేజ్ ఇచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ స్పం దించారు. సిరిసిల్ల బీవై నగర్‌కు చెందిన మంత్రి రవీందర్(45) అనే నేతన్న పెద్ద సేట్లు తనని వేధిస్తున్నారని పేర్కొంటూ నేను సచ్చిపోతున్న అని వాట్సప్‌లో పం పించిన వాయిస్‌పై ‘సాక్షి’ మెరుున్ ఎడిషన్‌లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ తన వ్యక్తిగత కార్యదర్శి కె.శ్రీనివాస్‌ను సిరిసిల్లకు పంపించారు. బీవై నగర్‌లోని రవీందర్ ఇంటికి వెళ్లి ఆయన భార్య రూప, కొడుకు కార్తీక్, మామ మల్లేశంతో మాట్లాడారు.
వృత్తిపరమైన ఇబ్బందులు ఏమున్నా మీ కుటుంబానికి బాసటగా ఉంటామని, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెల రోజులుగా రవీందర్ ఇంటికి రావడంలేదని, తాను పెద్దూరులోని తన పుట్టినింట్లో ఉంటున్నానని రవీందర్ భార్య రూప కన్నీరు పెడుతూ వివరించింది. సాయంత్రం 5 గంటలకు తాను వరంగల్‌లో ఉన్నట్లు రవీందర్ ఫోన్‌లో చెప్పారని అతడి బావ అధికారులకు తెలిపారు. దీంతో మంత్రి పీఎస్ వరంగల్ పోలీస్ కమిషనర్ గొట్టె సుధీర్‌బాబుకు అతడి ఫొటో, వివరాలను పంపించారు. ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయమే భద్రాచలం వెళ్తున్నట్లు చెప్పి వేములవాడ నుంచి వెళ్లినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
‘సాక్షి’ కథనంతో కదలిక..
రవీందర్ దీనగాథపై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కదిలారు. జిల్లా చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎం.వెంకటేశం, సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్, సైకాలజిస్ట్ పున్నంచందర్, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు డి.శ్రవణ్‌రావు తదిరులు రవీందర్ ఇంటికి వెళ్లి అతని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ అంశం సిరిసిల్ల వస్త్రవ్యాపారుల్లో చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన పెద్ద పాలిస్టర్ వ్యాపారుల పేర్లను రవీందర్ వాయిస్‌లో ఉటంకించడంతో వారిలో కలవరం మొదలైంది. రవీందర్‌కు రెండు వార్పింగ్ యంత్రాలున్నాయని, 15 మంది ఆసాములకు పని కల్పిస్తున్నాడని జౌళిశాఖ ఏడీ వెంకటేశం తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఈ విధమైన వాయిస్ మెసేజ్ పంపించాడని ఆయన వివరించారు.