రుణ ప్రణాళిక రూ.4437.65 కోట్లు
ప్రకటించిన కలెక్టర్
సంగారెడ్డి క్రైం : రూ.4437.65 కోట్ల అంచనాలతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 4437.65 కోట్ల రూపాయలని, ఇందులో పంట రుణాల కింద 1997.25 కోట్లు, టర్మ్, ఇతర పనులకు 388 కోట్లు, స్వయం సహాయక బృందాలకు 583 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 626 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు 325 కోట్లు, ఇతర రుణాల కింద 518 కోట్ల రూపాయలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు.
ఈ ఏడాది 2014-15 ప్రణాళిక కన్నా 325.65 కోట్ల రూపాయలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. రుణ ప్రణాళిక వంద శాతం సాధించేందుకు బ్యాంకర్లంతా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.వి.రమణారెడ్డి, ఎల్‌డీఎం రఘురాం, ఎస్‌బీహెచ్ జిల్లా కోఆర్డినేటర్ విజయమూర్తి, నాబార్డ్ డీడీఎం జి.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.