
సాక్షి, మంచిర్యాల : జిల్లాకేంద్రమైన మంచిర్యాలకు నిత్యం వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారి అవసరాలకు తగినట్లు అనేక దుకాణ సముదాయాలు, హోటళ్లు, సినిమాహాళ్లు ఇక్కడ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో బిర్యానీహౌస్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. రకరకాల రుచులతో వండి పెడుతున్నారు. అందుకు తగినట్టే డబ్బులూ వసూలు చేస్తున్నారు. కానీ.. వేడివేడిగా అందించే ఆహారపదార్థాల వెనుక కుళ్లిపోయిన మాంసం.. ఇతర ఆహార పదార్థాలు పెడుతున్నారు. ఈ విషయం గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో వెలుగుచూసింది. దుర్వాసన, కుళ్లిన ఆహార పదార్థాలు, పాడైన కూరలు, అపరిశుభ్రంగా నిల్వఉంచిన ఆహార పదార్థాలను ప్రజలకు పెడుతున్నట్లు గుర్తించారు. పాడైన చికెన్ లెగ్‌పీస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఇందు బార్‌అండ్ రెస్టారెంట్‌కు వెళ్లిన అధికారులకు అపరిశుభ్రత, పాడైన చికెన్‌లెగ్ పీసులు కనిపించాయి. దీంతో ఆ యజమానికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. అక్కడినుంచి అభిజిత్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడా అపరిశుభ్రతతోపాటు, ప్లాస్టిక్ కవర్లు లభించాయి. ఆ యజమానికి రూ.2వేల జరిమానా విధించారు.
డబ్బు పెట్టి రోగాలను తింటూ...
జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లలో కూర్చుని మద్యం సేవించి, రుచిగా ఉండే ఆహార పదార్థాలను ప్రజలు తింటుంటారు. మద్యంతాగాక ఎలాంటి ఆహారం పెట్టినా ఫర్వాలేదనుకున్నారో..? ముచ్చట్లలో పడి చూసుకోరు..? అనుకున్నారో ఏమోగానీ.. జిల్లా కేంద్రంలోని రెండు బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు పాడైన చికెన్ లెగ్‌పీస్‌లు, చికెన్ కర్రీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వండిన మాంసం మిగిలితే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి మరుసటి రోజు వేడిచేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. మద్యంతాగేవారు వేడిగా తెచ్చిన మాంసంతోపాటు, ఇతర ఆహార పదార్థాల రుచిని గుర్తించలేకపోతున్నారు. మత్తులో అవే ఆహార పదార్థాలు తింటూ.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఫ్రిజ్‌లను శుభ్రం చేయక పోవడం, మాంసంతోపాటు, శాఖాహారం కూడా ఫ్రిజ్‌లో మూతపెట్టకుండా ఉంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతోనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
జరిమానాలతోనే సరి....!
జిల్లాలో రెగ్యులర్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ లేడు. ఆహార పదార్థాల అమ్మకాలు, కల్తీ వ్యాపారంపై కనీసం ఒక్క కేసు నమోదు కాలేదు. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లాకేంద్రంలో తనిఖీలు చేసి జరిమానా విధించారు. అప్పుడు పది హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి రూ.5వేల చొప్పున ఒక్కో హోటల్‌కు జరిమానా విధించారు. కుళ్లిన ఆహారపదార్థాలను నిల్వ ఉంచితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మున్సిపల్ శానిటరీ సిబ్బంది కేవలం జరిమానాకే పరిమితం అవడంతోనే నిర్వాహకులు తనిఖీలకు భయపడడం లేదు. ఆహారం పాడైందా..? లేదా..? అనే విషయమై శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించే అధికారం కేవలం ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు మాత్రమే ఉంది.
కానీ.. ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు కనీసం కార్యాలయం కూడా లేదు. మున్సిపల్ కార్యాలయంలోనే ఓ మూలన టేబుల్ కేటాయించారు. ఎక్కడ కల్తీ జరిగినా కనీసం ఆ కల్తీ జరిగిందో లేదోనన్న విషయంపై ఇక్కడ పరిశీలించేందుకు ల్యాబ్ సౌకర్యం కూడా లేదు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చేందుకు.. ఆ రిపోర్టుపై చర్యలు తీసుకునేందుకు ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు ఉన్న అదనపు బాధ్యతలు అడ్డువస్తున్నాయి. దీంతోనే కుళ్లిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అమ్మే యజమానులపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కేవలం జరిమానాలను విధించి సరిపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment