వామ్మో..హోటళ్లలో ఫుడ్డా! | Stored Food Items In Hyderabad Hotels, Food Safety Probe Reveals Major Hygiene | Sakshi
Sakshi News home page

వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!

Published Sat, May 25 2024 7:50 AM | Last Updated on Sat, May 25 2024 11:31 AM

Stored food items In Hyderabad Hotels

‘హిల్స్‌’ హోటళ్లలో పరిశుభ్రతకు తిలోదకాలు 

గడువుతీరిన ఆహార పదార్థాలు 

బూజుపట్టిన సరుకులు 

కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకల స్వైర విహారం 

పాడైన చికెన్, మటన్‌ గుర్తింపు 

నోటీసులు జారీ చేస్తున్న అధికారులు      

కొన్ని హోటళ్లలో ఆహార పదార్థాల సీజ్‌ 

బంజారాహిల్స్‌: ఆర్భాటంగా... తళుకు బెళుకుల ఇంటీరియర్‌తో ఆకట్టుకునే ఫర్నీచర్‌తో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో నాణ్యతా లోపాలు, అపరిశుభ్రత, గడువుతీరిన ఆహార పదార్థాలు వెలుగు చూస్తుండటంతో ఆహార ప్రియులు షాక్‌ అవుతున్నారు. గడిచిన నాలుగు వారాల నుంచి ఫుడ్‌ సేప్టీ టాస్‌్కఫోర్స్‌ టీమ్‌ సభ్యులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట, పంజగుట్ట, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో ముఖ్యంగా కిచెన్‌లలో పరిశుభ్రత పూర్తిగా లోపించడంతో అధికారులు పేర్కొంటున్నారు. 

👉 జూబ్లీహిల్స్‌లోని 16 పబ్‌లలో అధికారులు తనిఖీలు చేయగా దాదాపు అన్నింట్లోనూ నిల్వ చేసిన ఆహార పదార్థాలు గడువుతీరిన తరువాత కూడా వంటల్లో వినియోగిస్తున్నట్లు నిర్థారించారు. 
👉ఇక హోటళ్లలోని కిచెన్‌లలో అపరిశుభ్రత, దుర్గంధం, దుర్వాసనలు, ఈగలు, దోమలు, ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు స్వైరవిహారం చేయడమే కాకుండా వంటలకు వినియోగిస్తున్న సామగ్రిపై వాలుతున్నట్లు కూడా గుర్తించారు. 
👉  వెజిటేరియన్, నాన్‌ వెజిటేరియన్‌ పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్‌లో ఒకే రాక్‌లో పెడుతుండడాన్ని కూడా అధికారులు గుర్తించారు. చాలా హోటళ్లలో కొన్ని ఆహార పదార్థాలు బూజు పట్టి కనిపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్‌లన్నీ బూజు పట్టిన కూరగాయలతో కనిపించాయి. 
👉 చాలా ఫిర్యాదుల అనంతరం ఇటీవల కాలంలో ఫుడ్‌సేప్టీ అధికారులు ఆయా హోటళ్లపై తనిఖీలు చేస్తూ నాణ్యతపై ఆరా తీస్తుండగా చాలా హోటళ్లలో ఆహార పదార్థాలపై క్రిమికీటకాలు వాలుతున్నట్లుగా నిర్థారణ అయ్యింది. చెత్తా చెదారం, వ్యర్థాలు వేసే డస్‌బిన్లపై మూతలు కూడా ఏర్పాటుచేయడం లేదని, దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. 
👉 ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న చైన్‌ హోటళ్లు ఉన్నాయని, అలాగే అంతర్జాతీయ స్థాయి చైన్‌ హోటళ్లు కూడా ఈ దుర్గంధం లోపించిన జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 
👉 జీహెచ్‌ఎంసీ గత పదేళ్లుగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోగా హోటళ్ల యాజమాన్యాలు ఇచ్చింది పుచ్చుకుంటూ అందినకాడికి దండుకుని అటువైపు తొంగి చూడలేదు. 
👉 జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ సర్కిల్‌–17, జూబ్లీహిల్స్‌ సర్కిల్‌–18 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్‌ ప్రాంతాల్లో సుమారు 35కి పైగా పబ్‌లు, 98 రెస్టారెంట్లు, 179 హోటళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్ల పరిధిలోని ఫుడ్‌ సూపర్‌వైజర్లు ఏనాడూ తనిఖీలు చేయకపోగా పరిశుభ్రతను పట్టించుకోలేదు. దీంతో కొత్తగా ఫుడ్‌సేప్టీ కమిషనర్‌ను ఏర్పాటుచేసి టాస్‌్కఫోర్స్‌ బృందాన్ని నియమించడంతో ఈ హోటళ్లు, పబ్‌లలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 
👉   కేఎఫ్‌సీ లాంటి ఇంటర్నేషనల్‌ చైన్‌ హోటళ్లలో కూడా ఈ అధికారులు దాడులు చేసి ఆహార పదార్థాల నాణ్యతపై నోటీసులు జారీ చేశారు.

ఉల్లంఘించిన హోటళ్ల జాబితా..
క్రీమ్‌ స్టోన్, నేచురల్స్‌ ఐస్‌క్రీమ్, కరాచి బేకరీ, కేఎఫ్‌సీ, రోస్ట్రీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్‌ హోటల్, 36 డౌన్‌ టౌన్‌ పబ్, మకావ్‌ కిచెన్‌ అండ్‌ బార్‌ పబ్, ఎయిర్‌ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, కిజిలింగ్‌ జో, ఖాన్‌సాబ్, హోటల్‌ సుఖ్‌సాగర్, జంబో కింగ్‌ బర్గర్స్, రత్నదీప్‌ రిటైల్‌ స్టోర్, సోమాజిగూడ కృతుంగ రెస్టారెంట్, సోమాజిగూడ రెస్ట్‌ ఓ బార్‌. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement