సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో అమెరికాలో కలకలం రేపింది. తరువాత అది నకిలీదని తేలింది. ఓ హాలీవుడ్ హీరోయిన్ పోర్న్ క్లిప్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం.. అందులో ఉన్నది తాను కాదన్నా ఎవరూ నమ్మలేదు. కానీ, ఆమె చెప్పేది నిజమే. మనకు నచ్చిన సెలబ్రిటీల శరీరానికి సామాన్యుల ముఖాలను అంటించి మురిసిపోయే వీలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ‘డీప్‌ఫేక్’సాఫ్ట్‌వేర్ సృష్టిస్తోన్న మాయాజాలమిది. ఈ యాప్ వచ్చిన కొత్తలో తమకు ఇష్టమైన హీరో, గాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ.. పలు ఫొటోలు, వీడియోలు సృష్టించి, వాటిని సోషల్ మీడియా వేదికలపై పంచుకునేవారు. వాటికి వచ్చే లైకులు చూసి సంబరపడిపోయేవారు. అక్కడి వరకే పరిమితమైతే సరిపోయేది. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి.. సంచలనం సృష్టించాలని, తమ టీవీ చానళ్లకు రేటింగులను పెంచాలనే దురుద్దేశంతో డీప్‌ఫేక్‌ను వాడుకుని సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. అవి నకిలీవని నిరూపించుకునేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు.
పలు దేశాల్లో నిషేధం..
టిక్‌టాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో డ్యాన్సులు, డబ్‌స్మాష్‌తో భారీ డైలాగులు చెబుతూ చాలామంది సంబరపడిపోతారు కదా! ఈ యాప్ కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే.. అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ, అనుసరించాలనుకున్న ముఖం కవళికలను ఈ సాఫ్ట్‌వేర్ ముందే పసిగడుతుంది. మీ బాడీకి ఏ సెలబ్రిటీ శరీరమైతే సరిగ్గా సరిపోతుందో సూచిస్తుంది. దాని ప్రకారం.. మీరు ఏదో వీడియోను చేసి, అందులో మీకు నచ్చిన సందేశం ఇచ్చేయాలి. తరువాత మీ ముఖంపై ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. అలా.. మీకు నచ్చిన ప్రముఖుల ముఖంలో మీ ముఖం ఇమడ్చడం, లేదా మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ ఇది. ముఖ కవళికలను ఎవరూ గుర్తుపట్టనంత స్పష్టంగా, నాణ్యంగా ఫొటోలు, వీడియోలు సృష్టించడం దీని ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఇందులో సెలబ్రిటీల గొంతుతోనే వీడియో వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోని ప్లేస్టోర్లలో ఈ సాఫ్ట్‌వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో చాలా యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించాయి. ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ల సాయంతో మోసాలు, దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, వీటిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment